Telangana : జీవో 9పై హైకోర్టు స్టే.. ప్రభుత్వం ముందు నాలుగు ఆప్షన్స్‌!

Telangana : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తెలంగాణ ప్రభుత్వం 25 శాతం నుండి 42 శాతానికి రిజర్వేషన్లను పెంచుతూ జీవోను జారీ చేసింది. ఈ జీవో రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉందని, సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఉల్లంఘిస్తుందని పేర్కొంటూ కొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ పిటిషన్లపై రెండు రోజుల పాటు వాదనలు విన్న కోర్టు చివరకు జీవో నెంబర్ 9 అమలుపై స్టే (మధ్యంతర ఉత్తర్వులు) విధించింది. దీనితో పాటు, ఈ అంశంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జీవో నెం. 9పై స్టే విధించడంతో, దీని ఆధారంగా జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది.

ప్రభుత్వం ఎన్నికలు త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్న తరుణంలో హైకోర్టు ఇలా జీవో 9పై హైకోర్టు స్టే ఇవ్వడం బిగ్ షాక్ అనే చెప్పవచ్చు. దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది. రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ముందు నాలుగు ఆప్షన్స్‌ ఉన్నాయి.

1. సుప్రీంకోర్టుకి వెళ్లి హైకోర్ట్‌ ఇచ్చిన స్టేను వెకేట్‌ చేయాలని కోరడం.
2. పార్టీ తరుపున 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లడం.
3.పాత రిజర్వేషన్లతో మరో నోటిఫికేషన్‌ ఇవ్వడం.
4. హైకోర్టులో కేసు తేలేవరకు ఎన్నికలు వాయిదా వేయడం.

బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీ అందిన తర్వాత న్యాయపరంగా తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు దురదృష్టకరమని ఆర్ .కృష్ణయ్య అన్నారు. సాయంత్రం వరకు ప్రభుత్వం దీనిపై స్పందించాలని లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.