Konda Surekha: ప్లీజ్ నాగార్జున సారీ.. అర్థరాత్రి మంత్రి సురేఖ ట్వీట్

Nagarjuna Surekha

Konda Surekha:  తెలంగాణ దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అర్థరాత్రి సంచలన ట్వీట్ చేయడం ఇప్పుడు రాష్ట్రరాజకీయాల్లో సంచలనంగా మారింది. గతంలో తాను నటుడు నాగార్జున కుటుంబం పైన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పట్ల ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ నిన్న (నవంబర్ 11, 2025) అర్ధరాత్రి దాటాక ట్వీట్ చేశారు.

నాగార్జున లేదా ఆయన కుటుంబ సభ్యులను కించపరిచే ఉద్దేశం నాకు లేదు. నా వ్యాఖ్యల వల్ల వారు బాధపడి ఉంటే చింతిస్తున్నాను. నేను చేసిన ఆ వ్యాఖ్యలను పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నాను అని ఆమె ట్వీట్‌లో స్పష్టం చేశారు.

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో మంత్రి కొండా సురేఖ నాగచైతన్య–−సమంత విడాకుల అంశాన్ని ప్రస్తావిస్తూ నాగార్జున కుటుంబంపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. దీనిపై నటుడు నాగార్జున తీవ్రంగా స్పందించి, ఆమెపై పరువు నష్టం దావా కూడా వేశారు. అంతేకాకుండా కేటీఆర్ కూడా పరువు నష్టం దావా కూడా వేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆమె నాగార్జున కుటుంబానికి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది.

నాంపల్లి కోర్టులో నాగార్జున వేసిన పరువు నష్టం దావాపై రేపు విచారణ జరగనుంది. దీంతో ఆమె ఒకరోజు ముందే క్షమాపణ చెప్పినట్లుగా తెలుస్తోంది. మరి ఆమె చెప్పిన సారీని నాగ్ అంగీకరిస్తారా లేదా అన్నది ఇంట్రెస్టింగ్  పాయింట్!

ఇక చైసామ్ పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నారని ఇది వారి వ్యక్తిగత నిర్ణయమని నాగార్జున ఇప్పటికే స్పష్టం చేశారు. తమ పేర్లను రాజకీయానికి దూరంగా ఉంచాలన్నారు. ఇక సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు.