Telangana : అవును.. సిలిండర్ల కొరత ఉంది.. మంత్రి సంచలన ప్రకటన!

Telangana

Telangana : గృహ అవసరాల కోసం వాడే డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్. ప్రస్తుతం రాష్ట్రంలో 1.3 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, ప్రతి నెలా సుమారు 58 నుండి 60 లక్షల డొమెస్టిక్ సిలిండర్లను ప్రజలు వాడుతున్నారని చెప్పారు. గృహ అవసరాల కోసం ప్రతిరోజూ 2.15 లక్షల సిలిండర్లను సరఫరా చేస్తున్నామని మంత్రి వివరించారు. ప్రజలు ఆందోళన చెంది ముందస్తుగా సిలిండర్లను బుక్ చేయడం వల్లే కొంత రద్దీ కనిపిస్తోందని, కానీ స్టాక్ విషయంలో ఎటువంటి కొరత లేదని తెలిపారు.

అయితే, కమర్షియల్ సిలిండర్ల విషయంలో మాత్రం కొంత కొరత ఉన్న మాట వాస్తవమేనని మంత్రి అంగీకరించారు. సాధారణంగా రోజుకు 23 వేల కమర్షియల్ సిలిండర్లు సరఫరా చేయాల్సి ఉండగా, ప్రస్తుతం 6,200 మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

ఆసుపత్రులకు మొదటి ప్రాధాన్యత

ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని, సుమారు 1740 సిలిండర్లను స్టాండ్-బైగా ఉంచామని వెల్లడించారు. ఎవరైనా బ్లాక్ మార్కెట్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫిర్యాదుల కోసం పౌరసరఫరాల కార్యాలయంలో హెల్ప్ లైన్ నెంబర్ 18004250033 ను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.