Hyderabad: అది ఐదేళ్ల క్రితం సోషల్ మీడియాలో మొదలైన పరిచయం.. ప్రేమగా మారింది, పెద్దల అంగీకారంతో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇక జీవితం సాఫీగా సాగిపోతుందనుకున్న తరుణంలో, అదనపు కట్నం రూపంలో మృత్యువు కబళించింది. వివాహమైన కేవలం 50 రోజులకే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
పోలీసుల వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన ఇషిక యాదవ్ (26) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఐదేళ్ల క్రితం ఫేస్‌బుక్ ద్వారా మధ్యప్రదేశ్‌కు చెందిన నీరజ్ బన్సాల్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. నీరజ్ కూడా గచ్చిబౌలిలోని ఒక స్టార్టప్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారడంతో, ఇరు కుటుంబాలను ఒప్పించి గత ఫిబ్రవరి 10న పట్నాలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత వీరు మియాపూర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు.
పెళ్లయిన కొద్దిరోజులకే నీరజ్ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. బంగారం, వజ్రాభరణాలతో పాటు అదనపు కట్నం తీసుకురావాలంటూ ఇషికను వేధించడం మొదలుపెట్టాడు. భర్త వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇషిక, బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
తమ కుమార్తెను అదనపు కట్నం కోసమే నీరజ్ వేధించి బలితీసుకున్నాడని ఇషిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మియాపూర్ సీఐ పి. శివప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెళ్లైన 50 రోజులకే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
