Bus Accident : కర్నూలు బస్సు దుర్ఘటనలో 19 మంది సజీవదహనం అయ్యారు. కర్నూలు శివారు ప్రాంతం, చిన్న టేకూరు సమీపంలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వీ-కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర అగ్నిప్రమాదానికి గురైంది. చనిపోయిన వారిలో మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు.
గురువారం రాత్రి 10:30 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరిన ఏసీ స్లీపర్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కర్నూలు శివారుకు చేరుకుంది. అదే సమయంలో, బస్సు బైక్‌ను వేగంగా ఢీకొట్టింది. అయితే బైక్‌ను ఢీకొట్టిన తర్వాత కూడా డ్రైవర్ బస్సును ఆపకుండా సుమారు 300 మీటర్ల దూరం లాక్కెళ్లాడు. ఈ క్రమంలో బైక్ పెట్రోల్ ట్యాంక్ పగిలి, లీకైన పెట్రోల్‌కు బస్సు కింద ఘర్షణ వల్ల మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు క్షణాల్లోనే బస్సు అంతటా వ్యాపించాయి. దీంతో అందులోనే కొందరు ప్రయాణికులు తప్పించుకుని బయటపడగా మరికొంతమంది అగ్నికి ఆహుతి అయిపోయారు.
బస్సు లగేజీ కంపార్ట్‌మెంట్‌లో అక్రమంగా తరలిస్తున్న వందల సంఖ్యలో మొబైల్ ఫోన్ల బ్యాటరీలు కూడా మంటలకు పేలడం వలన, అగ్నికీలలు మరింత వేగంగా, తీవ్రంగా వ్యాపించి, ప్రయాణికులకు బయటపడే అవకాశం లేకుండా పోయింది. ఈ బస్సు ప్రమాదంలో మెదక్ జిల్లాకు చెందిన తల్లి,కూతురు ఇద్దరు మృతి చెందారు. కూతురు చందనను బెంగళూరులో డ్రాప్ చేసేందుకు సంధ్యారాణి వెళ్లింది. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో చందన ఉద్యోగం చేస్తుండగా.. మూసాపేట్ Y జంక్షన్ దగ్గర ఇద్దరు ఈ బస్సు ఎక్కారు. L-14, L-15 బెర్తులు బుక్ చేసుకున్నారు.
సంధ్యారాణి, వేణు దంపతుల స్వగ్రామం మెదక్ మండలం శివాయిపల్లి. వేణు దంపతులు దుబాయిలో ఉండగా, బెంగళూరులో చందన జాబ్ చేస్తుంది. వీరి కుమారుడు వల్లభ్ అలహాబాద్‌లో చదువుకుంటున్నాడు. దీపావళి సందర్భంగా ఫ్యామిలీతో కలిసి పండుగ చేసుకున్న వేణు.. రెండు రోజుల క్రితమే దుబాయి వెళ్లిపోయాడు. కూతురుని బెంగళూరులో డ్రాప్ చేసి దుబాయి వెళ్లాలని ప్లాన్ చేసుకుంది సంధ్యారాణి. ఇంతలోనే బస్సులో ప్రమాదంలోచిక్కుకుని కూతురితో పాటుగా చనిపోయింది.
