నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మజిపేట ఎస్సై హరిప్రసాద్ రెడ్డి అవినీతికి పాల్పడుతూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఇసుక అక్రమ రవాణా కేసులో సీజ్ చేసిన ఒక ట్రాక్టర్, జేసీబీని వదిలిపెట్టడానికి ఆయన రూ. 25 వేలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో, అధికారులు పక్కా ప్లాన్‌తో ఎస్సైని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన ఎస్సై
బాంబులు కాల్చి సంబరాలు చేసుకున్న ప్రజలు
నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మజిపేటలో రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన ఎస్సై హరిప్రసాద్ రెడ్డి
ఇసుక అక్రమ రవాణా కేసులో సీజ్ చేసిన ట్రాక్టర్, జేసీబీని… pic.twitter.com/064FwnGBo6
— Telugu Scribe (@TeluguScribe) March 30, 2026
ఎస్సై అరెస్ట్ వార్త తెలియగానే స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రజలు భారీగా గుమిగూడారు. టపాకాయలు కాల్చి అవినీతి ఎస్సై డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాధితులు ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేవలం లంచాలే కాకుండా, చిన్న చిన్న విషయాలకే దారుణంగా కొట్టేవాడని, పీడించేవాడని ప్రజలు వాపోయారు.
ఊర్లో సీసీ కెమెరాలు పెట్టిస్తానని చెప్పి గ్రామ గ్రామాన బలవంతంగా వసూళ్లు చేశాడని, భూ తగాదాల్లో తలదూర్చి లక్షల్లో దండుకున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఒక పోలీస్ అధికారి అవినీతికి పాల్పడి దొరికిపోతే ప్రజలు ఇలా సంబరాలు చేసుకోవడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
