Telangana : కలిసి నూరేళ్లు బతకాలని ఆ దేవుడి సాక్షిగా ప్రమాణం చేశారు. కానీ, విధి ఆడిన వింత నాటకంలో ఏడాది తిరగకముందే ఆ జంట విడిపోయింది. ఒకరు లేని లోకంలో మరొకరు ఉండలేమనుకున్నారో ఏమో.. భర్త చావుబతుకుల్లో ఉన్నాడని తెలిసి భార్య తనువు చాలించగా, ఆమె వెళ్ళిన వారం రోజుల్లోనే భర్త కూడా కన్నుమూశాడు. నిన్నటి దాకా నవ్వుతూ తిరిగిన ఆ ఇంట్లో ఇప్పుడు మృత్యు నిశ్శబ్దం అలుముకుంది.
మంచిర్యాల జిల్లాకు చెందిన కంబాల నరేష్(34), గొల్లపల్లికి చెందిన మమత(29)లు 14 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నరేష్ గోదావరిఖని సింగరేణిలో ఉద్యోగం చేస్తూ భార్యతో కలిసి అక్కడే ఉంటున్నాడు. అంతా సాఫీగా సాగిపోతుందనుకున్న సమయంలో, ఈ నెల 16న శివరాత్రి పూజలు ముగించుకుని ఇంటికి వచ్చిన నరేష్, మెట్ల మీద నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. తలకు తీవ్రమైన దెబ్బ తగలడంతో ఆస్పత్రిలో చేర్చారు.
అయితే, నరేష్ బతికే ఛాన్సులు చాలా తక్కువని డాక్టర్లు చెప్పడంతో భార్య మమత తట్టుకోలేకపోయింది. తన భర్తకు ఏదైనా జరిగితే తను ఉండలేనని మనస్తాపంతో మరుసటి రోజే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. అటు మృత్యువుతో పోరాడుతున్న నరేష్ కూడా పరిస్థితి విషమించి ఆదివారం తెల్లవారుజామున మరణించాడు.
ఇలా వారం వ్యవధిలోనే భార్యాభర్తలు ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. మరోవైపు, మమత తండ్రి ఫిర్యాదుతో పోలీసులు నరేష్ కుటుంబ సభ్యులపై వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
