Bus Accident : సొమ్మసిల్లి పడిపోయిన అక్కా చెల్లెళ్ల తల్లి.. రోదిస్తున్న తండ్రి!

bus accident sisters

Bus Accident చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు 24కి చేరింది మృతుల సంఖ్య. ఇద్దరు డ్రైవర్లతో పాటు 22 మంది ప్రయాణికులు మృతి చెందారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు కూడా ఉన్నారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు. తనుషా, సాయి ప్రియ, నందిని అనే ముగ్గురు అక్కా చెల్లెళ్లు మృతి చెందారు.

ఈ విషయం తెలియగానే సొమ్మసిల్లి పడిపోయింది వారి తల్లి.. మరోవైపు కుమార్తెలు మృతి చెందడంతో తండ్రి రోదిస్తున్నాడు. ఆయనకు నలుగురు కుమార్తెలు. ఈ నెల 15వ తేదీన పెద్ద కుమార్తె వివాహం చేయగా.. మిగతా ముగ్గురు కుమార్తెలు బస్సు ప్రమాదంలో మృతి చెందారు.

బీటెక్ మూడు, బీటెక్ రెండవ, మొదటి సంవత్సరం చదువుతున్న ముగ్గురు కుమార్తెలు మృతి చెందారు. తండ్రి డ్రైవర్‌గా పని చేస్తూ పిల్లలను చదివించాడు. ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో విగత జీవులుగా మారడంతో ఆ కుటుంబం, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇక తాండూరు యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ గ్రామానికి చెందిన అఖిల రెడ్డి అనే యువతి కూడా మృత్యువాత పడింది. యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్‌కు చెందిన అఖిల ఎంబీఏ చదువుతుంది. కుమార్తె మృతితో అఖిల తల్లి, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.