Mahabubnagar : మహబూబాబాద్ జిల్లాలో సర్పంచ్ ఎన్నికల బరిలో రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి…పోటీ నుంచి తప్పుకునేందుకు, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి మధ్య జరిగిన డబ్బుల ఒప్పంద పత్రం లీకేజీ…కలకలం రేపింది. నామ పత్రాలు ఉపసంహరణకు రాసుకున్న అగ్రిమెంటు పత్రాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రామచంద్రనాయక్ గ్రామస్తులకు చూపిస్తూ, ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన…దంతాలపల్లి మండలం… బీరిశెట్టి గూడెంలో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన జట్టి మహేశ్వరిని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించింది. కాగా అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో రెబల్ వ్యక్తి తన భార్య తో సర్పంచిగా నామ పత్రాలు దాఖలు చేశారు. అప్పటికే 10 వార్డులకు 8 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన రెండు వార్డులతో పాటు రెబల్ సర్పంచ్ అభ్యర్థి పోటీ నుంచి తప్పు కునేందుకు రూ.13 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు.
ఈ నెల 6న నామ పత్రాలను వెనక్కి తీసుకోవాల్సి ఉండగా…సదరు రెబల్ అభ్యర్థి అందుకు నిరాకరించడంతో పోటీ అనివార్యమైంది. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే రామచంద్రనాయక్ అగ్రిమెంట్ పత్రాన్ని చూపిస్తూ…పార్టీకి చెందిన రెబల్ అభ్యర్థిపై మండిపడ్డారు.
పార్టీలో ఉంటూ రెబల్ గా పోటీ చేసి అవినీతికి పాల్పడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిని పార్టీ నుంచి సస్బెండ్ చేయాలంటూ ఆదేశించారు. గ్రామ అభివృద్ధికి అడ్డు పడుతూ…బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తిపై చీటింగ్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.
