Nirmal : అమెరికా నుంచి వచ్చి ఓటేసిన మామ..సర్పంచ్ గా గెలిచిన కోడలు

Nirmal

Nirmal :  నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని బాగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యంత ఆసక్తికరమైన విజయం నమోదైంది. ఇక్కడ కేవలం ఒక్క ఓటు తేడాతో ముత్యాల శ్రీవేద అనే అభ్యర్థి విజయం సాధించారు. ఈ స్వల్ప మెజారిటీ వెనుక విదేశం నుండి వచ్చిన ఆమె మామ ఓటు కీలకంగా మారడం చర్చనీయాంశమైంది.

ముత్యాల శ్రీవేద గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని తెలుసుకున్న ఆమె మామ, ముత్యాల ఇంద్రకరణ్ రెడ్డి, అమెరికాలో నివసిస్తున్నప్పటికీ ఎన్నికల పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు స్వగ్రామానికి చేరుకున్నారు. కోడలి విజయం కోసం ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 426 ఓట్లకు గాను 378 ఓట్లు పోలయ్యాయి.

కౌంటింగ్‌లో శ్రీవేదకు 189 ఓట్లు రాగా, ఆమె ప్రత్యర్థి హర్షస్వాతికి 188 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు చెల్లనిదిగా ప్రకటించబడింది. దీంతో, ఇంద్రకరణ్ రెడ్డి అమెరికా నుంచి వచ్చి వేసిన ఆ ఒక్క ఓటు శ్రీవేద విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించినట్లయింది. కుటుంబ సభ్యుల మద్దతుతో శ్రీవేద సాధించిన ఈ విజయం గ్రామంలో సంతోషాన్ని నింపింది.

ఈ పంచాయతీలో ముత్యాల నారాయణరెడ్డి 1972లో సర్పంచిగా గెలుపొందగా.. 2013లో చిన్నమ్మ ముత్యాల రజిత గెలుపొందారు. ఇప్పుడు మూడో తరం ప్రతినిధిగా శ్రీవేద విజయం సాధించారు.

ఇక వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలం రాంపూర్‌లో కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థి గొల్ల రమాదేవి అఒక్క ఓటు తేడాతో విజయం సాధించింది. బీఆర్ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థి దుర్గనోల్ల మౌనికకు 116 ఓట్లు వచ్చాయి. గొల్ల రమాదేవికి 117 రావడంతో ఒక్క ఓటు తేడాతో సర్పంచిగా విజయం సాధించారు.