Telangana : కౌశిక్ రెడ్డి వర్సెస్ కడియం.. అసెంబ్లీ సాక్షిగా రచ్చ రచ్చ

cm revanth

Telangana : తెలంగాణ శాసనసభ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మైనింగ్ అక్రమాలు, రాఘవ కన్‌స్ట్రక్షన్స్ వ్యవహారం, ఎమ్మెల్యేల మధ్య వ్యక్తిగత దూషణల చుట్టూ సభలో తీవ్ర దుమారం రేగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

సభలో సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. “కడియం శ్రీహరి నీతి, నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరు. ఆయన మచ్చలేని నాయకుడు. కేసీఆర్‌తో సమానంగా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తిని అంత అసహ్యంగా దూషిస్తారా?” అని ప్రశ్నించారు. ఈ ప్రవర్తనను కేటీఆర్, హరీష్ రావు సమర్థిస్తారా అని నిలదీస్తూ, కౌశిక్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే అవమానం కేసీఆర్‌కు జరిగితే ఊరుకుంటారా అని ఆయన ప్రశ్నించారు.

రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌తో పాటు గత 12 ఏళ్లుగా జరుగుతున్న మైనింగ్ దోపిడీపై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, అసలు అక్రమాలను గుర్తించి నోటీసులు ఇచ్చిందే తమ ప్రభుత్వమని స్పష్టం చేశారు. “మేము ఇచ్చిన నోటీసులనే పట్టుకుని బీఆర్ఎస్ హడావిడి చేస్తోంది. గత ప్రభుత్వం ఏమీ చేయలేదు. అవినీతిని నిగ్గు తేల్చడానికి మేము ఇప్పటికే సీబీసీఐడీ విచారణకు ఆదేశించాం” అని ప్రకటించారు. ఒకవేళ హౌస్ కమిటీ వేస్తే అందులో హరీష్ రావు కూడా సభ్యుడిగా ఉండాలని సవాల్ విసిరారు.

“నీవు చేసిన పనికి నేను ఇరుక్కున్నాను” అని హరీష్ రావుపై కేటీఆర్ దాడి చేశారని, ఆ అంతర్గత గొడవల నుంచి దృష్టి మళ్లించడానికే సభలో గందరగోళం సృష్టిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తాను భయపడబోనని, ఉడత ఊపులకు లొంగేది లేదని సీఎం స్పష్టం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ఒక ఏటీఎంలా మార్చుకుందని సీఎం విమర్శించారు. అమిత్ షా, కిషన్ రెడ్డిల విన్నపం మేరకు దీనిని సీబీఐ విచారణకు అప్పగించామని, కానీ ఇప్పటివరకు ఫలితం ఏమైందని ప్రశ్నించారు. ఎన్ని నెలలు గడిచినా విచారణలో పురోగతి లేకపోవడాన్ని ఆయన ఎత్తిచూపారు.