Nalgonda : ఎదురించి ప్రేమ పెళ్లి.. పాపం 12 రోజులకే!

Nalgonda

Nalgonda : నల్గొండ జిల్లా దామెరలో విషాదం చోటుచేసుకుంది. కాళ్లపారాణి ఆరకముందే నవవధువు మృతి చెందింది. రోడ్డు ప్రమాదంలో అనూష అనే యువతి చనిపోయింది. చాంలేడు గ్రామానికి చెందిన చిలువేరు నవీన్‌, నాంపల్లి మండలం, దామెర గ్రామానికి చెందిన అనూష (22) ప్రేమించుకున్నారు. పెద్దలు అంగీకరించకపోవడంతో 12 రోజుల క్రితం నవీన్‌ను అనూష ప్రేమపెళ్లి చేసుకున్నారు.

పెళ్లి అనంతరం నవీన్ తన భార్య అనూషతో కలిసి గుర్రంపోడు వైపు బైక్‌పై వెళ్తుండగా .., బైక్‌ ఢీకొట్టడంతో బ్రిడ్జిపై నుంచి ఎగిరి వాగులో పడింది అనూష. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అనూష మృతి చెందింది. స్థానికులు దాదాపు 20 నిమిషాల పాటు గాలించి ఆమెను బయటకు తీశారు. నవీన్‌కు నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

నర్సింగ్ పూర్తి చేసిన అనూష త్వరలోనే ఉద్యోగంలో చేరాలనుకుంది. కళ్ల పారాణి ఆరకముందే నవవధువు మృతి చెందడం, వరుడు ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నవదంపతులకు ఈ రూపంలో మృత్యువు కబళించడం అందరినీ కలచివేసింది.