Hyderabad : పోలీసు ఇంటికే కన్నం.. అరుణాచలం వెళ్లొచ్చేసరికి

Hyderabad

Hyderabad :ఏకంగా పోలీసు ఇంటికే కన్నం వేశారు దొంగలు.. శంషాబాద్‌లోని మధురానగర్ కాలనీలో నివాసం ఉంటున్న పోలీసు ఉద్యోగి కృష్ణ గౌడ్ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. కృష్ణ గౌడ్ తన కుటుంబంతో కలిసి అరుణాచలం ఆలయానికి వెళ్లాడు. ఈ సమయంలో దొంగలు ఆయన ఇల్లును లూటీ చేశారు.

కుటుంబ సభ్యులు ఇంట్లో లేని అదును చూసి అర్ధరాత్రి వేళ దొంగలు లోపలికి ప్రవేశించారు. ఇంటి ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి బీరువాల్లో ఉన్న భారీ మొత్తంలో బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును ఎత్తుకెళ్లారు. దర్శనం అనంతరం ఇంటికి చేరుకున్న కృష్ణ గౌడ్ కుటుంబం, చెల్లాచెదురుగా ఉన్న సామాగ్రిని చూసి షాక్‌కు గురయ్యారు.

కృష్ణ గౌడ్ కుటుంబం ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్ సహాయంతో వేలిముద్రలను సేకరించారు. కాలనీలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసు ఇంట్లోనే దొంగతనం జరగడం స్థానికంగా కలకలం రేపింది.