Karimnagar : మెడలో చెప్పులు వేసుకుని రాజీనామా చేస్తా.. సర్పంచ్ అభ్యర్థి సంచలనం!

Karimnagar

Karimnagar : ఎన్నికల్లో  తాను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కులానికి ఒక చెప్పు చొప్పున మెడలో వేసుకుని రాజీనామా చేస్తానని ఓ సర్పంచ్ అభ్యర్థి బాండ్ రాసివ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లామానకొండూర్‌ మండలం చెంజర్ల గ్రామంలో గుమ్మడవెల్లి రాజేశ్వరి అనే మహిళ ఎన్నికల బరిలో నిలిచారు.

తనను గెలిపిస్తే 12పడకల ఆసుపత్రి, మినీ ఫంక్షన్ హాల్, ఓపెన్ జిమ్ ఏర్పాటుతో పాటు కోతుల సమస్యను పరిష్కరిస్తానని బాండుపై రాసిచ్చారు. మూడు ఏళ్లలో వీటిని పూర్తిచేయకపోతే రాజీనామా చేస్తానన్నారు. ఆమె ఈ హామీలను రూ. 100 విలువైన బాండ్‌పేపర్‌పై వ్రాయించి, సంతకం చేసి విడుదల చేయడం విశేషం.

డబ్బులు, మద్యం పంచకుండా తనలాగే మేనిఫెస్టో విడుదల చేసి కేవలం ఓట్లు అడగాలని తన ప్రత్యర్థులను ఆమె కోరారు. ఈ విధంగా వినూత్నంగా, హామీ పత్రంతో ఎన్నికల బరిలో నిలవడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.

తల్లి vs కూతురు 

జగిత్యాల జిల్లాలోని కోరుట్ల మండలం తిమ్మాయపల్లె గ్రామం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ బీసీ మహిళా రిజర్వ్‌డ్ కావడంతో సర్పంచ్ పదవి కోసం ఏకంగా తల్లి, కూతురే ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నారు. తల్లి శివరాత్రి గంగవ్వకు  బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తోంది. కూతురు సుమలతకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోంది.

కూతురు సుమలత తమ తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా వివాహం చేసుకోవడంతో కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. ఈ కుటుంబ వైరం ఇప్పుడు రాజకీయ పోరుకు దారి తీసి, తిమ్మాయపల్లె సర్పంచ్ ఎన్నికను అత్యంత ఆసక్తికరమైన పోటీగా మార్చింది. తల్లీ, కూతురు ఇద్దరూ తమ గెలుపు కోసం దూకుడుగా ప్రచారం చేస్తున్నారు