TG Elections : నెరవేర్చకపోతే దించేయండి.. బాండ్‌ పేపర్‌పై బోలేడు హామీలు!

TG Elections

TG Elections : ఎన్నికల్లో హామీలు ఇవ్వడం సాధారణమే కానీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే తనను పదవి నుంచి తొలగించవచ్చని రూ.100 బాండ్‌ పేపర్‌పై రాసిస్తూ ఓట్లు అడుగుతున్న ఓ సర్పంచ్ అభ్యర్థి ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారారు. మెదక్ జిల్లా హవేలీ ఘన్‌పూర్ మండలం రాజుపేట తండా కాప్రాయిపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానానికి బీఆర్‌ఎస్‌ మద్దతుతో బరిలో ఉన్న కె.మౌనిక తన వినూత్న ప్రచారంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

సర్పంచ్‌గా తనను గెలిపిస్తే అమలు చేసేందుకు వీలుగా మౌనిక 15 ముఖ్యమైన హామీలను రూ.100 విలువైన బాండ్‌ పేపర్‌పై లిఖితపూర్వకంగా గ్రామ ప్రజలకు ఇస్తున్నారు.ఇంతకు ఆమె ఏ హామీలు ఇచ్చారంటే..

గ్రామంలో ఆడపిల్ల పుట్టిన ప్రతి కుటుంబానికి ‘బంగారు తల్లి’ పేరుతో రూ.2,000 ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు.తీజ్ పండుగకు రూ.20,000 విరాళం, ముదిరాజ్ బోనాల పండుగకు రూ.8,000 విరాళం, ఎల్లమ్మ బోనాల పండుగకు రూ.3,000 విరాళం ఇస్తానని ఆమె తన హామీలలో తెలిపారు. అంతేకాకుండా గ్రామంలో ఎవరైనా అకాల మరణం చెందితే, వారి అంత్యక్రియల కోసం కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ హామీలలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఇప్పుడు తాను ఇచ్చిన హామీలను అమలు చేయని పక్షంలో, తనను కలెక్టర్ లేదా జిల్లా కోర్టు ద్వారా సర్పంచ్ పదవి నుంచి తొలగించవచ్చని మౌనిక ఆ బాండ్‌ పేపరుపై స్పష్టంగా పేర్కొన్నారు. ఈ హామీ పత్రాన్ని గ్రామ ప్రజలకు చూపిస్తూ, తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటూ ఆమె ఓటు అభ్యర్థిస్తున్నారు. మౌనిక ఇచ్చిన ఈ వినూత్న హామీలు, బాండ్‌ పేపర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read :