Telangana : నిజంగా లక్కీపో..ఒక్క ఓటు తేడాతో గెలిచారు!

telangana

Telangana : తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు చాలా మంది సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించారు.

ఇక ఈ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో కొంతమంది అభ్యర్థులు సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించారు. ఒక్క ఓటు ఎంతో కీలకమో వీరి విజయాలను చూస్తే అర్థం అవుతుంది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని పరందోలి గ్రామ సర్పంచిగా స్వతంత్ర అభ్యర్థి రాథోడ్‌ పుష్పలత విజయం సాధించింది.

మెదక్‌ జిల్లా రేగోడ్‌ మండలం కొండాపుర్‌లో ఒకే ఓటు తేడాతో సర్పంచ్ అభ్యర్థి గెలిచారు. ప్రత్యర్థిపై ఉత్కంఠగా సాగిన పోరులో కాంగ్రెస్‌ మద్దతుదారు బేగరి పండరి నెగ్గారు. అటు మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం దామరవంచ సర్పంచ్‌ ఫలితంలో ఉత్కంఠ నెలకొంది. మొదట 3 ఓట్లతో బీఆర్ఎస్ మద్దతుదారు స్వాతి గెలుపొందారు. రీకౌంటింగ్‌లో కాంగ్రెస్‌ మద్దతుదారు సుజాత ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు.

రంగారెడ్డి జిల్లా కొందుర్గ్‌ మండలం చిన్న ఎల్కచెర్ల గ్రామంలోఎన్నికల పోరు ఉత్కంఠగా సాగింది. ఇద్దరు అభ్యర్థులకు సమానంగా 212 ఓట్లు రావడంతో రీకౌంటింగ్‌ నిర్వహించారు. రీకౌంటింగ్‌లోనూ సమాన ఓట్లు రావడంతో అధికారులు టాస్‌ వేశారు. కాంగ్రెస్‌ మద్దతుదారు మరాఠి రాజ్‌కుమార్‌ని అదృష్టం వరించింది.

యాదాద్రి జిల్లా లక్ష్మక్కపల్లిలో లాటరీతో సర్పంచి ఫలితం తేలింది. ఇద్దరికీ సమానంగా 148 ఓట్లు రావడంతో అధికారులు డ్రా తీశారు. లాటరీలో బీఆర్ఎస్ మద్దతుదారు ఇండ్ల రాజయ్యను విజయం వరించింది.