Hyderabad: లవ్ జిహాద్ కేసులో సంచలనం..మత్తు ఇచ్చి తమ్ముళ్లతోనే..!

Kukatpally

Hyderabad:  హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన లవ్ జిహాద్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. బాధితురాలు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై జరిగిన ఘోరాలను వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది.

నవాజ్ అనే వ్యక్తి ఇంటి అద్దె కోసం వచ్చి బాధితురాలితో పరిచయం పెంచుకున్నాడు. తాను హిందూ మతంలోకి మారానని ఆమెను నమ్మించి, ప్రేమ పేరుతో వలలో వేసుకున్నాడు. పెళ్లికి ముందే ఆమె వద్ద నుండి సుమారు 16.5 లక్షల రూపాయలు వసూలు చేశాడు. జూలై 28, 2025న వీరిద్దరి రిజిస్టర్ మ్యారేజ్ జరిగింది.

పెళ్లి జరిగిన మొదటి రోజు నుంచే నవాజ్ కుటుంబ సభ్యులు ఆమెను శారీరకంగా వేధించడం ప్రారంభించారు. పెళ్లి రోజే నవాజ్ తన తమ్ముళ్లతో కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వారి మాట వినేలా ఆమెకు మత్తు మందు ఇచ్చేవారని బాధితురాలు ఆరోపించారు. ఒకవేళ ఈ విషయాలు ఎవరికైనా చెబితే ఆమె కుటుంబాన్ని చంపేస్తామని నవాజ్ కుటుంబం బెదిరింపులకు దిగింది.

పెళ్లి తర్వాత ఆమెను ముస్లిం మతంలోకి మారాలని తీవ్రంగా వేధించారు. ఆమెతో బలవంతంగా బీఫ్ (గోమాంసం) తినిపించడానికి ప్రయత్నించారు. అంతేకాకుండా, “త్రిపుల్ తలాక్” చెప్పిన తర్వాత వేరే అబ్బాయిల దగ్గరికి వెళ్లాలని, అది తమ మత పద్ధతి అని నవాజ్ సోదరి ఆమెకు చెప్పి మానసికంగా వేధించింది. అలా చేస్తేనే నవాజ్ తల్లి పెళ్లిని ఒప్పుకుంటుందని ఒత్తిడి తెచ్చారు.

నవాజ్ ఆమెకు చెందిన 12 తులాల బంగారం, భూమిని అమ్మేశాడు. అలాగే ఆమె ఫోన్లు, ఐప్యాడ్స్‌ను కూడా విక్రయించాడు. ఆర్థికంగా, శారీరకగా ఆమెను పూర్తిగా కృంగదీశాడు. సెప్టెంబర్ నెలలో ఆమెను విపరీతంగా కొడుతూ, బట్టలు చింపేసి అమానుషంగా ప్రవర్తించేవాడని ఆమె వాపోయారు.

జనవరి 16 నుంచి నవాజ్ కనిపించకుండా పోయాడు. దీనిపై కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తే, వారు మోసం కేసు నమోదు చేయకుండా కేవలం మిస్సింగ్ కేసు మాత్రమే తీసుకున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు. మార్చిలో నవాజ్ తన స్నేహితులతో కలిసి వచ్చి మళ్ళీ బెదిరించాడని, తనకు న్యాయం జరగాలని, తనలాగా మరే అమ్మాయి మోసపోకూడదని ఆమె డిమాండ్ చేసింది.