Hyderabad: పూర్ణిమ కిరాతకం… భర్తను చంపి లవర్ తో షాపింగ్!

Hyderabad

Hyderabad:  మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ ఈస్ట్ బృందావన్ కాలనీలో జరిగిన అశోక్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి చంపేసిన పూర్ణిమ.. ఆ తర్వాత పది రోజుల పాటు సాగించిన డ్రామా చూసి పోలీసులు సైతం విస్తుపోతున్నారు. తన భర్త గుండెపోటుతో చనిపోయాడని నమ్మించిన ఆమె, పది రోజుల పాటు ఏమీ తెలియనట్టు నటించింది.

అశోక్ ను చంపేసిన మూడవ రోజే పూర్ణిమ ఏకంగా తన ప్రియుడు మహేష్‌తో కలిసి షాపింగ్‌కు వెళ్లడం ఈ కేసులో అత్యంత షాకింగ్ అంశం. భర్త మరణించిన విషాదంలో ఉండాల్సిన భార్య, ఇలా ప్రియుడితో కలిసి విహరించడం ఆమె క్రూరత్వానికి అద్దం పడుతోంది. పది రోజుల పాటు బంధువులను, పోలీసులను తప్పుదోవ పట్టించిన పూర్ణిమ.. చివరకు పోస్టుమార్టం రిపోర్ట్ రావడంతో అడ్డంగా దొరికిపోయింది. అశోక్ మెడపై గాయాలు ఉండటంతో బంధువులు అనుమానం వ్యక్తం చేయగా, పోలీసులు లోతుగా విచారించి అసలు నిజాన్ని బయటపెట్టారు.

అశోక్, పూర్ణిమలు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ, పెళ్లికి ముందే ఆమెకు మరొకరితో సంబంధం ఉన్నట్లు సమాచారం. ఇటీవల కాలనీకి చెందిన మహేష్‌ అనే వ్యక్తితో పూర్ణిమకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం అశోక్‌కు తెలియడంతో భార్యను మందలించాడు. దీంతో అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసిన పూర్ణిమ.. ఇంటి బెడ్రూంకు రెండు వైపులా మెట్లు, తలుపులు ఉండేలా ముందే జాగ్రత్త పడింది. డిసెంబర్ 11న అశోక్ ఇంటికి రాగానే, పూర్ణిమ ప్లాన్ ప్రకారం మహేష్, అతని స్నేహితుడు సాయి కలిసి మూడు చున్నీలతో అశోక్ గొంతు బిగించి హత్య చేశారు.

హత్య జరిగిన తర్వాత అశోక్ బాత్‌రూమ్‌లో పడిపోయాడని, హార్ట్ ఎటాక్ వచ్చిందని పూర్ణిమ అందరినీ నమ్మించింది. పోస్టుమార్టం చేస్తే అసలు విషయం బయటపడుతుందని భయపడి, మహేష్‌తో కలిసి ఆసుపత్రి వద్ద కూడా పోస్టుమార్టం జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయితే, అశోక్ సోదరి, బంధువుల పట్టుబట్టడంతో నిజం నిప్పులా బయటపడింది. ప్రస్తుతం మేడిపల్లి పోలీసులు పూర్ణిమ, మహేష్ , సాయిలను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.