Municipal Election Results 2026 : సిరిసిల్లలో KTR క్రేజ్… కాంగ్రెస్ ఖతం!

ktr

Municipal Election Results 2026 : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కనిపిస్తున్నా, సిరిసిల్లలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోయింది. మాజీ మంత్రి కేటీఆర్ నియోజకవర్గం కావడంతో ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికల్లో ఓటర్లు మరోసారి గులాబీ జెండాకే పట్టం కట్టారు.

సిరిసిల్ల మున్సిపాలిటీలోని మొత్తం 39 వార్డులకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏకంగా 27 వార్డులను కైవసం చేసుకుని మున్సిపల్ పీఠాన్ని సుస్థిరం చేసుకుంది. మంత్రి వర్గ ప్రభావం ఉన్నా, అధికార బలమున్నా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కేవలం 6 వార్డులకే పరిమితమై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇక బీజేపీ 5 వార్డుల్లో విజయం సాధించగా, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. సిరిసిల్ల అభివృద్ధిపై కేటీఆర్ చేసిన కృషికి ఈ ఫలితాలే నిదర్శనమని బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

మరోవైపు, వేములవాడ మున్సిపాలిటీలో మాత్రం ఫలితాలు రసవత్తరంగా మారాయి. మొత్తం 28 వార్డుల్లో ఏ పార్టీకి కూడా మున్సిపల్ పీఠం దక్కించుకోవడానికి కావాల్సిన 15 వార్డుల (మ్యాజిక్ ఫిగర్) బలం లభించలేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 13 వార్డులతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, అధికారం దక్కించుకోవాలంటే మరో ఇద్దరి మద్దతు అవసరం.

బీజేపీ 8, బీఆర్ఎస్ 5 స్థానాల్లో నిలవగా.. ఇద్దరు స్వతంత్రులు ఇప్పుడు ఇక్కడ ‘కింగ్ మేకర్లు’గా మారారు. వీరు ఎటు మొగ్గు చూపితే అటు మున్సిపల్ పీఠం దక్కే అవకాశం ఉంది.