Telangana IAS Transfers: తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో అన్నింటికంటే ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా నియామకం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
గతంలో హనుమకొండ కలెక్టర్‌గా పనిచేసిన స్నేహా శబరీశ్‌ను మహబూబాబాద్ కలెక్టర్‌గా నియమించగా, అదే జిల్లాలో ఆమె భర్త శబరీష్ ప్రస్తుతం ఎస్పీగా కొనసాగుతున్నారు. ఇలా భార్యాభర్తలు ఇద్దరూ ఒకే జిల్లాలో కలెక్టర్, ఎస్పీలుగా బాధ్యతలు చేపట్టడం విశేషం.
2017 బ్యాచ్‌కు చెందిన స్నేహా శబరీశ్ గతంలో జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌గా, నిజామాబాద్ అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక హనుమకొండ కొత్త కలెక్టర్‌గా ఆసిఫాబాద్ నుండి చాహత్ బజ్పాయ్ రానున్నారు.
సచివాలయంలోని కీలక శాఖల్లో కూడా ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్‌గా సంజయ్ కుమార్, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఈ. శ్రీధర్, ఐటీ శాఖకు ఎన్. శ్రీధర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆర్థిక శాఖలో గౌరవ్ ఉప్పల్ సెక్రటరీగా, సిక్తా పట్నాయక్ స్పెషల్ సెక్రటరీగా నియమితులయ్యారు.
అలాగే విపత్తు నిర్వహణ బాధ్యతలను దాన కిషోర్‌కు, జనరల్ అడ్మినిస్ట్రేషన్‌ను రాహుల్ బొజ్జాకు అప్పగించారు. విద్యుత్ రంగంలో జితేశ్ వి. పాటిల్ SPDCL సీఎండీగా, ముషారఫ్ ఫారూకీ కొత్త డిస్కం సీఎండీగా బాధ్యతలు తీసుకోనున్నారు.
జిల్లాల వారీగా చూస్తే మహబూబ్‌నగర్‌కు బి. విజయేంద్ర, కరీంనగర్‌కు చిత్ర మిశ్రా, భద్రాద్రి కొత్తగూడెంకు అంకిత్, యాదాద్రికి అనురాగ్ జయంతి కలెక్టర్లుగా వెళ్తున్నారు. అలాగే జనగాం, గద్వాల, సిరిసిల్ల, వికారాబాద్, మెదక్ జిల్లాలకు కూడా కొత్త కలెక్టర్లను నియమించారు.
పమేలా సత్పతి, బి.ఎం. సంతోష్, రాహుల్ రాజ్ వంటి అధికారులకు లేబర్, ట్రైబల్ వెల్ఫేర్, కోఆపరేటివ్ విభాగాల్లో కీలక బాధ్యతలు కల్పించారు. మొత్తానికి పాలనలో వేగం పెంచేందుకే ప్రభుత్వం ఈ స్థాయిలో అధికారులను అటు ఇటు మార్చినట్లు తెలుస్తోంది.
