Telangana Govt : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలలో ఒకటైన గృహజ్యోతి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. అయితే ఈ పథకం పొందుతున్న లబ్ధిదారులకు నిబంధనల పరంగా పెద్ద షాక్ తగలనుంది. ఆర్థిక భారం తగ్గించుకునే ఉద్దేశంతో ప్రభుత్వం(Telangana Govt ) ఈ పథకంలో కీలక మార్పులు చేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఈ మార్పులు కనుక అమలులోకి వస్తే మాత్రం అర్హులైన లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. నెలవారీ విద్యుత్ వినియోగం 200 యూనిట్ల లోపు ఉంటే బిల్లు సున్నాగా వస్తుంది. ఒకవేళ 200 యూనిట్లు దాటితే మాత్రం పూర్తి బిల్లు కట్టాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న నిబంధన ప్రకారం నెలలో ఎప్పుడైనా 200 యూనిట్లు దాటితే పథకం వర్తించదు. ఈ నిబంధనను మరింత కఠినతరం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్తులో ఏ నెలలో అయినా ఒక్కసారి 200 యూనిట్లు దాటితే, ఆ ఇంటికి ఉచిత విద్యుత్ పథకం శాశ్వతంగా నిలిచిపోయే అవకాశం ఉండేలా మార్పులు చేయాలని సర్కార్ ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం.
అంతేకాకుండా పథకం ప్రారంభమైనప్పటి నుండి దాదాపు 51.26 లక్షల మంది లబ్ధిదారులు ఈ ఉచిత విద్యుత్ ఫథకాన్ని పొందుతున్నారు. అయితే ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేకుండా ప్రభుత్వం నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో దాదాపు 93 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీరందరికీ ఈ పథకం వర్తింపజేస్తే లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగి ప్రభుత్వంపై ఆర్థిక భారం మరింత ఎక్కువవుతుంది. ఈ పథాకానికి ప్రస్తుతం ప్రభుత్వంపై రూ.185- నుంచి 200 కోట్ల భారం పడుతోంది. ఈ భారాన్ని తగ్గించుకోవడానికే ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేయాలని భావిస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం.