Telangana : సిగ్గులేని లెక్చరర్లు.. పీరియడ్స్ వస్తే చూపించాలంటూ టార్చర్!

telangana

Telangana :  వెస్ట్ మారేడ్‌పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తీవ్ర విషాదం నెలకొంది. లెక్చరర్ల వేధింపులు, దురుసు ప్రవర్తన కారణంగా మానసిక ఒత్తిడికి లోనైన ఓ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థిని అకస్మాత్తుగా మృతి చెందింది. సదరు విద్యార్థిని శుక్రవారం కాలేజీకి కొంత ఆలస్యంగా వచ్చింది.

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన లెక్చరర్లు శ్రీలక్ష్మి, మధురిమ ఆమెను అందరిముందు తీవ్రంగా మందలించారు. ఆ సమయంలో బాలిక తనకు పీరియడ్స్ (నెలసరి) కారణంగానే ఆలస్యమైందని, అసౌకర్యంగా ఉందని ప్రాధేయపడింది. అయితే, ఆ లెక్చరర్లు కనికరం చూపకపోగా, “పీరియడ్స్ వచ్చాయంటే నాటకాలు ఆడుతున్నావా? ఏదీ చూపించు” అంటూ అత్యంత దురుసుగా, అవమానకరంగా ప్రవర్తించారని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

లెక్చరర్ల ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి, మానసిక వేదనకు గురైన సదరు విద్యార్థిని కాలేజీ నుంచి ఇంటికి వెళ్లగానే కుప్పకూలిపోయింది. హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగా మెదడులో రక్తం గడ్డకట్టి ఆమె మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు.

తమ బిడ్డ మరణానికి కారణమైన లెక్చరర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాలు కళాశాల ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. “విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే ఇలా అమానవీయంగా ప్రవర్తిస్తే విద్యార్థులకు దిక్కెవరు?” అని వారు ప్రశ్నిస్తున్నారు. నిందితులైన లెక్చరర్లను వెంటనే అరెస్ట్ చేయాలని నినాదాలు చేయడంతో కాలేజీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.