Ande Sri : అందెశ్రీ బాల్యం ఎంతో కష్టంగా సాగింది. ఆయన తన తల్లిదండ్రులు ఎవరో, తన సొంత ఊరు ఎక్కడో తెలియదు. చిన్నతనంలోనే అనాథగా మారి, జీవనం కోసం కొన్నాళ్లు గొర్రెల కాపరిగా పనిచేశారు. అక్కడి నుంచే ఆయన కవిత్వం రాయడం ప్రారంభించారు. ఆయన తన స్వీయ కృషి, పట్టుదలతో తెలుగు సాహిత్యంపై పట్టు సాధించారు.
కవిత్వంలో ఆయన కృషికి గాను పలు విశ్వవిద్యాలయాలు ఆయనకు డాక్టరేట్ (గౌరవ డాక్టరేట్) ప్రధానం చేశాయి.ఆయనకు గుర్తింపు తెచ్చిన మొట్టమొదటి పాట తెలంగాణ పల్లెల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన ‘తాగుబోతు పాట’ (‘మాయమైపోతున్నడమ్మ… మనిషన్నవాడు’). ఆయన మొదటిసారి స్టేజిపై పాడింది కూడా ఈ పాటనే.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయన రాసిన పాటలు, ముఖ్యంగా “జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం” అనే గేయం ఊపిరిగా నిలిచింది. ఈ పాట లేకుండా ఉద్యమ సభ ఉండేది కాదు. ఈ పాటనే తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా ఎంపిక చేశారు. సినీ రంగంలో ఆయన రాసిన పాటల్లో ఎంతో లోతైన భావాలు ఉంటాయి. ‘ఒక విచిత్రం’ సినిమాలో “ఈతరం తీర్పు” అనే పాట, ‘ముత్యాల ముగ్గు’ సినిమాలో “చిలకా ఏడున్నది” అనే పాటలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి.
సినీ గేయ రచయితగా ఆయనకు 2007లో విడుదలైన ‘గంగ’ చిత్రంలోని పాటలకు ఉత్తమ గీత రచయితగా ప్రతిష్ఠాత్మకమైన నంది అవార్డు లభించింది. గొప్ప అక్షర జ్ఞానం లేకపోయినా, సాహిత్యంలో ఆయన చేసిన సేవకు గాను ఉస్మానియా విశ్వవిద్యాలయం (OU) తో పాటు మరికొన్ని విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశాయి.
జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న ఈ ప్రజాకవికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన సేవలకు గాను ప్రభుత్వం రూ. కోటి నగదు పురస్కారం అందించింది. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
