IBOMMA : తెలంగాణ పోలీసులకు బిగ్ షాక్ తగిలింది. రాష్ట్రంలోని ప్రముఖ పోలీస్ కమిషనరేట్లైన సైబరాబాద్, రాచకొండ పోలీసుల అధికారిక వెబ్‌సైట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. ఆ రెండు వెబ్‌సైట్లను ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే, అవి నేరుగా ఒక గేమింగ్ అప్లికేషన్‌కు రీడైరెక్ట్ అవుతున్నట్లుగా టెక్నికల్ ఎక్స్ పర్ట్స్ గుర్తించారు.
ఈ టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా, దాదాపుగా గత వారం రోజుల నుంచి ఈ రెండు కమిషనరేట్ల వెబ్‌సైట్లు పూర్తిగా ఓపెన్ కావడం లేదు. సైట్లలోకి మాల్‌వేర్ ఎంటర్ అయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెబ్‌సైట్ల హ్యాకింగ్‌పై స్పందించిన పోలీసు శాఖ, వాటిని పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక ఐటీ టీమ్స్ పనిచేస్తున్నాయి.
భవిష్యత్తులో ఇలాంటి హ్యాకింగ్‌లు జరగకుండా ఉండేందుకు అదనంగా అడ్వాన్స్‌డ్ ఫైర్‌వాల్స్‌ను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ వెబ్‌సైట్ల హ్యాకింగ్ వెనుక ఇటీవల కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్న ఐబొమ్మ రవి అనే వ్యక్తి ప్రమేయం ఉండవచ్చని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు.
ఈ హ్యాకింగ్‌కు ఐబొమ్మ రవికి ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
