Telangana : మటన్ కూర లొల్లి.. దసరా రోజు భార్య.. దీపావళికి భర్త సూసైడ్!

telangana

Telangana : వారిద్దరూ ప్రేమించుకున్నారు.. పెద్దలను కూడా ఒప్పించారు. చివరకు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. పదికాలాలపాటు వీరి సంసారం బాగుండాలని పెద్దలు దీవెనలు అందించారు. కానీ విధి మరోలా రాసింది. నెల గడవక ముందే ఇద్దరు తనువు చాలించి వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపారు.

వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం, ఎర్దండి గ్రామానికి చెందిన బోదాసు సంతోష్ (26), గంగోత్రి (22) ఇద్దరూ ఒకే కాలనీకి చెందినవారు. కొంతకాలంగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి 2025 సెప్టెంబర్ 26న వారి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కేవలం ఆరు రోజుల్లోనే, దసరా పండుగ రోజున (అక్టోబర్ 2న) భార్య గంగోత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

దసరా రోజు తన భార్యతో కలిసి అత్తింటికి వెళ్లాడు సంతోష్‌.. అక్కడ రాత్రి భోజనం చేస్తున్న సమయంలో మటన్ కూరలో కారం ఎక్కువైందని భార్యను మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన గంగోత్రి.. అదే రోజు రాత్రి అత్తింట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

దీంతో ప్రేమించి, పెళ్లాడిన అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర మనో వేదనతో ఉన్న సంతోష్‌ వారం రోజుల కిందట ఆదిలాబాద్‌ లో ఉండే తన అక్క వద్దకు వెళ్లాడు. అక్కడ మంగళవారం ఇంట్లో ఎవరూ లేని టైమ్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.పెళ్లయి నెల రోజులైనా గడవకముందే దంపతులు లోకం వీడటంతో ఎర్దండి గ్రామంలో తీవ్ర విషాదం ఛాయలు అలుముకున్నాయి.