Telangana : వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఈ ఘటన మెదక్ జిల్లాలో కలకలం రేపింది. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో, కట్టుకున్న భర్తను అందులోనూ ఇల్లరికం వచ్చిన భర్తను ప్రియుడితో కలిసి అత్యంత దారుణంగా హత్య చేసిందో భార్య. ఆ తరువాత ఏమీ తెలియనట్లుగా డ్రామాలు ఆడి చివరకు పోలీసులకు దొరికిపోయింది.
అసలేం జరిగిందంటే.. శివ్వంపేట మండలం తిమ్మాపూర్‌కు చెందిన స్వామి, మౌనికలకు 12 ఏళ్ల క్రితం పెళ్లి కాగా వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, కొంతకాలంగా మౌనికకు తనకంటే ఐదేళ్లు చిన్నవాడైన సంపత్ అనే యువకుడితో పరిచయం ఏర్పడగా.. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. భార్య ప్రవర్తనలో తేడా గమనించిన స్వామి ఇలాంటి పనులు చేసి పరువు తీయకూడదని ఆమెను హెచ్చరించాడు. మరోసారి ఇలా చేస్తే పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెడతానని భార్యను గట్టిగా మందలించాడు.
తన ప్రియుడితో కలిసి ఉండటానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన మౌనిక, అతడిని వదిలించుకోవాలని ఫిక్స్ అయింది. 2024 డిసెంబర్ 22వ తేదీన రాత్రి స్వామి మద్యం తాగి ఇంటికి వచ్చి గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఇదే సరైన టైమ్ అనుకున్న భావించిన మౌనిక, వెంటనే తన ప్రియుడు సంపత్‌ను ఇంటికి పిలిపించింది. ఇద్దరూ కలిసి నిద్రలో ఉన్న స్వామిని గొంతు నులిమి అత్యంత కిరాతకంగా చంపేశారు.
హత్య చేసిన అనంతరం సాక్ష్యాధారాలు దొరక్కుండా ఉండేందుకు నిందితులు మాస్టర్ ప్లాన్ వేశారు. స్వామి మృతదేహాన్ని బైక్‌పై ఎక్కించుకుని ఊరి శివారులోని నెరేళ్లకుంట చెరువు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ మృతదేహాన్ని నీటిలో పడేసి, అతడు మద్యం మత్తులో ఆకస్మాత్తుగా చెరువులో పడి చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేశారు.
మరుసటి రోజు శవం బయటపడటంతో మౌనిక కన్నీరుమున్నీరుగా విలపిస్తూ అందరినీ నమ్మించింది. అయితే, ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారణ ప్రారంభించారు. కాల్ డేటాతో పాటుగా ఇతర ఆధారాలను సేకరించిన పోలీసులు మౌనికను గట్టిగా ప్రశ్నించగా, అసలు నిజం బయటపడింది. ప్రియుడు సంపత్‌తో కలిసి తనే హత్య చేసినట్లు ఆమె ఒప్పుకుంది.
దీంతో పోలీసులు మౌనిక, సంపత్‌ను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. తండ్రి మరణించి, తల్లి జైలుకు వెళ్లడంతో ఆ ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు.
