Wine shops : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills by-election) నేపథ్యంలో హైదరాబాద్ లో మద్యం ప్రియులకు బిగ్ బ్యాడ్ న్యూస్. ఎన్నికల నిబంధనల్లో భాగంగా.. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మద్యం దుకాణాలు (Wine Shops), బార్లపై నాలుగు రోజుల పాటు ఆంక్షలు విధించారు. అంటే నాలుగు రోజుల పాటు మద్యం దుకాణాల బంద్ కానున్నాయి. ఎక్సైజ్ చట్టం 1968లోని సెక్షన్ 20 ప్రకారం ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మోహంతీ ఆదేశాలు జారీ చేశారు.
పోలింగ్‌ను దృష్టిలో ఉంచుకుని, 2025 నవంబర్ 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. అలాగే 14వ తేదీన కౌంటింగ్ ఉండటంతో, ఆ రోజు ఉదయం నుండి లెక్కింపు పూర్తయ్యే వరకు మళ్లీ వైన్ షాపులు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నాలుగు రోజులు జూబ్లీహిల్స్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఎవరైనా నింబధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాజకీయంగా చాలా ఉత్కంఠభరితంగా మారింది. అన్నిపార్టీలు కూడా దీనిపై చాలా ఫోకస్ పెట్టాయి. గెలుపు కోసం భారీగా కసరత్తులు చేస్తూ, ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.
అయితే పోటీ మాత్రం ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానే ఉండబోతుందని సర్వేలు చెబుతున్నాయి. నామినేషన్ దాఖలు నాటి నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు అన్ని పార్టీల కలిపి రూ.300 కోట్ల వరకు వ్యయం చేయవచ్చని తెలుస్తోంది.
