నాలుగు నెలలకే .. యాదగిరిగుట్ట ఆలయ EO రాజీనామా

eo

EO : తెలంగాణ దేవాదాయశాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం EO వెంకట్రావు తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలతో రాజీనామా చేసినట్లుగా ఆయన తన లేఖలో తెలిపారు. అయితే ఆయన రాజీనామాకు వెంటనే ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

గతంలో దేవాదాయ శాఖ కమిషనర్‌గా సేవలు అందించారు వెంకట్రావు. ఐఏఎస్ అధికారిగా పదవీ విరమణ చేసిన అనంతరం ప్రభుత్వం ఆయనను ఆగస్టు 31, 2025న యాదగిరిగుట్ట ఆలయ ఈవోగా నియమించింది. సుమారు నాలుగు నెలల పాటు ఈ బాధ్యతలు నిర్వహించిన ఆయన, ప్రస్తుతం అనారోగ్య కారణాల వల్ల బాధ్యతల నుండి తప్పుకున్నారు.

అయితే ఆయన రాజకీయ ఒత్తిడి వల్ల కూడా ఆయన రాజీనామా చేసి ఉండవచ్చనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. దీని తరువాత రవినాయక్ ఇన్-చార్జ్ ఈవోగా నియమితులయ్యారు. కొత్త ఈవోను ప్రభుత్వం త్వరలోనే నియమించనుంది. వెంకట్రావు యాదాద్రి భువనగిరి జిల్లాలో డీఆర్‌డీవోగా, సూర్యాపేట కలెక్టర్‌గా విధులు నిర్వహించారు.

ఇక టీటీడీ తరహాలో బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా తొలి అడుగు ఐఏఎస్‌ అధికారిని ఈవోగా నియమించింది. ఇక త్వరలోనే 18 మందితో కూడిన ఆలయ పాలకవర్గాన్ని ఏర్పాటు చేయనుంది.