jagtial : జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో గుండెలను పిండేసే ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియా వేదికగా లక్షలాది మందిని అలరించిన ఒక వర్ధమాన యూట్యూబర్ జీవితం, సొంత భర్త చేతిలోనే చనిపోవడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ప్రేమించి పెళ్లాడిన భర్తే కాలయముడిగా మారి, నిండు గర్భిణి అని కూడా చూడకుండా భార్యను హతమార్చాడు.
కోరుట్ల అయ్యప్ప గుట్టకు చెందిన హరిబాబు, మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి ఏడాది క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. తొలినాళ్లలో ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ దంపతులు, తమ వ్యక్తిగత జీవితాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఏడు నెలల క్రితం ‘Vaishu Amma‘ పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. అతి తక్కువ కాలంలోనే 48 వేలకు పైగా సబ్ స్క్రైబర్లను సంపాదించుకున్న ఈ ఛానల్, వైష్ణవికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. వారి హోం టూర్ వీడియోలు, పెళ్లి దృశ్యాలు, ముఖ్యంగా వైష్ణవి గర్భవతి అయిన తర్వాత చేసిన షార్ట్ వీడియోలకు మిలియన్లలో వ్యూస్ వచ్చాయి. తెరపై ఎంతో సంతోషంగా కనిపించే ఈ జంట మధ్య ఇంతటి విషాదం దాగి ఉందని ఎవరూ ఊహించలేదు.
ఆ రాత్రి అసలేం జరిగింది?
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. చిన్నపాటి మనస్పర్థలు కాస్తా పెను వివాదానికి దారితీశాయి. ఆ సమయంలో కోపంతో ఊగిపోయిన హరిబాబు, నాలుగు నెలల గర్భిణి అని కూడా దయ లేకుండా వైష్ణవిని గొంతు నులిమి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆదివారం ఉదయం ఎంతసేపటికీ వైష్ణవి గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు లోపలికి వెళ్లి చూడగా, ఆమె విగతజీవిగా పడి ఉంది. అప్పటికే హరిబాబు అక్కడి నుండి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
వైష్ణవి మరణవార్త తెలియగానే ఆమె కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రస్తుతం ఆమె భర్త హరిబాబు కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వైష్ణవి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతను ఎటు వెళ్ళాడనే కోణంలో విచారణ సాగుతోంది.
