లేడీ జేమ్స్ బాండ్ ఇక లేరు… విజయనిర్మలకు నివాళి

ప్రముఖ నటి, డైరెక్టర్… సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల(73) కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1946 ఫిబ్రవరి 20న తమిళనాడులో పుట్టారు. విజయనిర్మల తండ్రిది చెన్నై, తల్లిది గుంటూరు. ఏడేళ్ల వయసులోనే ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన విజయనిర్మల.. ఆరు దశాబ్దాల పాటు సినిమాలే జీవితంగా బతికారు. 1950లో మత్య్సరేఖ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన విజయనిర్మల… పాండురంగ మహత్యం, రంగులరాట్నం, పూలరంగడు, సాక్షి, అసాధ్యుడు, మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు, కురుక్షేత్రం లాంటి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళం, మళయాళం భాషల్లో 200కు పైగా సినిమాల్లో నటించి.. 44 సినిమాలకు డైరెక్షన్ చేశారు. ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు డైరెక్షన్ చేసిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించారు.దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, హేమాహేమీలు, రామ్ రాబర్ట్ రహీం, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, కలెక్టర్ విజయ లాంటి సక్సెస్ ఫుల్ సినిమాలకు దర్శకత్వం వహించారు. విజయనిర్మల అసలు పేరు నిర్మల. విజయా ప్రొడక్షన్స్ తనకు వెన్నుదన్నుగా నిలవడంతో విజయనిర్మలగా పేరు మార్చుకున్నారు. ఇక సాక్షి అనే సినిమాతో సూపర్ స్టార్ కృష్ణతో మొదలైన ప్రయాణం సుధీర్ఘంగా సాగింది. 47 సినిమాల్లో కృష్ణతో కలిసి స్క్రీన్ ని షేర్ చేసుకున్నారు. తన తొలి చిత్రం ‘రంగులరాట్నం’కి నంది అవార్డు అందుకున్నారు. సినీ రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే రఘుపతి వెంకయ్య అవార్డునూ సొంతం చేసుకున్నారు. విజయనిర్మల తొలి భర్త కృష్ణమూర్తి. ఆయన నుంచి విడిపోయాక కృష్ణను రెండో పెళ్లి చేసుకున్నారు. సినీనటుడు నరేష్ విజయనిర్మల సంతానం. నటి జయసుధకు ఈమె పిన్ని. విజయనిర్మల మృతితో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నింపింది.

LEAVE A REPLY