Donald Trump Gold Prices : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తన రెండో పదవీకాలాన్ని ప్రారంభించిన ఏడాది కాలంలోనే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు(Donald Trump Gold Prices ) భారీగా పెరిగాయి. గతంతో పోలిస్తే ఏకంగా 70 శాతానికి పైగా పెరిగాయి. దీంతో చరిత్రలో మొదటిసారిగా ఒక ఔన్స్ బంగారం ధర 4,700 డాలర్ల మార్కును దాటింది. మంగళవారం నాటి ట్రేడింగ్లో స్పాట్ బంగారం ధర 1 శాతం పెరిగి 4,717.03 డాలర్లకు చేరుకోగా, ఒక దశలో ఇది గరిష్టంగా 4,721.91 డాలర్లను తాకింది.
ఇక ఫిబ్రవరి డెలివరీకి సంబంధించిన గోల్డ్ ఫ్యూచర్స్ ధర 2.8 శాతం పెరిగి 4,722.70 డాలర్ల వద్ద స్థిరపడింది. ప్రస్తుత కరెన్సీ మార్పిడి విలువ ప్రకారం, భారతీయ రూపాయిల్లో ఒక ఔన్స్ బంగారం ధర సుమారు 4,32,004 రూపాయలుగా నమోదైంది. ఈ భారీ పెరుగుదల కారణంగా గ్లోబల్ మార్కెట్లో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు.
200 శాతానికి పైగా పెరగడం
బంగారంతో పాటు వెండి ధరలు కూడా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి వెండి ధర సుమారు 200 శాతానికి పైగా పెరగడం విశేషం. సెషన్ ప్రారంభంలో ఒక ఔన్స్ వెండి ధర 94.72 డాలర్ల గరిష్ట స్థాయిని తాకినప్పటికీ, ఆ తర్వాత స్వల్పంగా తగ్గి 94.23 డాలర్ల వద్ద కొనసాగుతోంది. దీని విలువ భారతీయ కరెన్సీలో సుమారు 8,630 రూపాయలుగా ఉంది.
ఈ ధరల పెరుగుదలకు ప్రధానంగా డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వాణిజ్య విధానాలే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఐరోపా మిత్రదేశాల నుంచి వచ్చే దిగుమతులపై అదనపు సుంకాలు విధిస్తామన్న ట్రంప్ హెచ్చరికలు మార్కెట్లో ఆందోళన కలిగించాయి. దీనికి తోడు వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం, అమెరికా డాలర్ ఒక వారం కనిష్ట స్థాయికి పడిపోవడం బంగారానికి కలిసివచ్చింది. యూరోపియన్ యూనియన్ ప్రతిచర్యగా అమెరికా ఆస్తులను విక్రయించే అవకాశం ఉందన్న భయాలు కూడా ఇన్వెస్టర్లను బంగారం వంటి సురక్షిత ఆస్తుల వైపు నడిపిస్తున్నాయి.
ప్రస్తుత పరిస్థితులపై మార్కెట్ నిపుణులు స్పందిస్తూ, అంతర్జాతీయ వాణిజ్య చర్చల్లో స్పష్టత వచ్చే వరకు ఈ అనిశ్చితి కొనసాగుతుందని పేర్కొంటున్నారు. ఒకవేళ దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రతరం అయితే, రానున్న రోజుల్లో బంగారం ధరలు మరిన్ని గరిష్టాలను చూడవచ్చని వారు అంచనా వేస్తున్నారు. ట్రంప్ అనుసరిస్తున్న అసాధారణ రాజకీయ నిర్ణయాలు గ్లోబల్ ఎకానమీని ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో, భారత్ వంటి దేశాల్లో బంగారం ధరల పెరుగుదల స్థానిక మార్కెట్లపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది.
Also Read :
- PM SVANidhi credit card : వడ్డీ లేదు.. షూరిటీ లేదు: రూ.50 వేల స్వనిధి క్రెడిట్ కార్డ్ పొందండిలా.. ఎలా అప్లయ్ చేయాలంటే?
- One lakh rupees chitti Calculation : రూ. లక్ష చిట్టి వేస్తున్నారా? ఎప్పుడు ఎత్తుకుంటే లాభమో తెలుసా? ఈ లెక్క చూడండి!
