Vijay TVK Symbol : విజయ్ పార్టీకి ఎన్నికల గుర్తు వచ్చేసింది..ఈసీ గ్రీన్ సిగ్నల్!

Vijay TVK Symbol

Vijay TVK Symbol :  తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ( Vijay TVK Symbol) పార్టీకి భారత ఎన్నికల సంఘం (ECI) గురువారం ఎన్నికల గుర్తును కేటాయించింది. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా టీవీకే పార్టీకి ‘ఈల’ (Whistle) గుర్తును కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ, తమకు ఎన్నికల గుర్తును కేటాయించాలని గత ఏడాది నవంబర్ 11న ఎన్నికల సంఘాన్ని కోరింది. 1968 నాటి ఎన్నికల గుర్తుల కేటాయింపు రూల్స్ ప్రకారం.. ఈసీ దగ్గర అందుబాటులో ఉన్న ఏడు గుర్తులతో పాటు, తాము స్వయంగా రూపొందించిన మూడు గుర్తులను పరిశీలించాలని పార్టీ ప్రతినిధులు దరఖాస్తు చేసుకున్నారు. అన్నింటినీ పరిశీలించిన ఎన్నికల సంఘం, చివరికి ఈల గుర్తును కేటాయించింది. ఇకపై విజయ్ పార్టీ ఈ గుర్తుతోనే ప్రజల్లోకి వెళ్లనుంది.

మరోవైపు ప్రముఖ నటుడు కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీకి ఈసీ తిరిగి బ్యాటరీ టార్చ్ (Battery Torch) గుర్తునే కేటాయించింది. 2019 లోక్‌సభ ఎన్నికలతో పాటు, 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కమల్ పార్టీ ఇదే గుర్తుపై పోటీ చేసింది. పాత గుర్తునే తిరిగి కేటాయించడంపై ఎంఎన్ఎం శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ, అటు విజయ్, ఇటు కమల్ హాసన్ పార్టీలకు గుర్తులు ఖరారు కావడంతో రాష్ట్రంలో ఎన్నికల సందడి మరింత ఊపందుకోనుంది.