చిన్నారి శ్రీహిత హత్య కేసులో అసలేం జరిగింది ?

జూన్ 18. అర్థరాత్రి. 1.30 గంటల ప్రాంతం. తల్లి పొత్తిళ్లలో హాయిగా నిద్రపోతున్న శ్రీహిత మాయమైంది. పడుకున్న దగ్గర పాలసీసా అలాగే ఉంది. నిద్ర లేస్తే పాలు తాగించేందుకు సీసాను పక్కనపెట్టుకుని పడుకుంది తల్లి రచన. కానీ చిన్నారి ఏడుపు వినిపించలేదు. అసలు కనిపించనే లేదు. రెండు గంటల వెతుకులాట తర్వాత… ప్రవీణ్ చేతుల్లో టవల్ లో రక్తపు ముద్దగా మారింది శ్రీహిత. స్థానికులు వెంటాడటంతో పడేసి పారిపోయే ప్రయత్నం చేశాడా మృగాడు. పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మరోవైపు శ్రీహితను హాస్పిటల్ కు తరలించగా అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు డాక్టర్లు. పోస్టుమార్టంలో తేలిందేంటంటే… 9 నెలల పసిగుడ్డు అత్యాచారానికి గురైందని. తలపై రెండు గాయాలను గుర్తించారు వైద్యులు.

శ్రీహిత అత్యాచారంతో మానవత్వమే కన్నీరు పెట్టింది. మనిషిని అని మరిచిన ప్రవీణ్ అనే సైకో… ముక్కుపచ్చలారని చిన్నారిని చిదిమేశాడు. మానవమృగం చేతిలో ఊపిరాడక తిరిగిరాని లోకాలకు వెళ్లింది చిన్నారి శ్రీహిత. రెండురోజుల తర్వాత వరంగల్ నగరం అట్టుడికింది. తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారామేంటని మానవ సమాజం భగ్గుమంది. అంతకుముందే హాజీపూర్ సైకో శ్రీనివాస్ రెడ్డి సీరియల్ కిల్లింగ్స్ తో అట్టుడికిన తెలంగాణ… శ్రీహిత అత్యాచారాన్ని జీర్ణించుకోలేకపోయింది. నిందితుడిని పబ్లిగ్గా ఉరితీయాలని డిమాండ్ చేసింది. కానీ కోర్టులు, పోలీసులు, వ్యవస్థకు అవేవీ కనిపించవు కదా. సాక్ష్యాలు, ఆధారాలు కావాలి. వాటి కోసం రెండు నెలలపాటు ప్రయత్నాలు జరిగాయి. వరంగల్ బార్ అసోసియేషన్ ప్రవీణ్ వైపు నుంచి వాదించకూడదని సంచలన నిర్ణయం తీసుకుంది. దాంతో 48 రోజుల్లోనే ఛార్జ్ షీట్ ని కోర్టుకు సమర్పించారు పోలీసులు. అంతే. వరంగల్ అడిషనల్ సెషన్స్ కోర్టు ప్రవీణ్ కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

LEAVE A REPLY