జేసీతో జగన్ చెడుగుడు : తొక్కుడు మామూలుగా లేదుగా

జేసీ దివాకర్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ మోస్ట్ పొలిటిషియన్. అనంతపురం జిల్లాలో తిరుగులేని రాజకీయవేత్త ప్లస్ బిజినెస్ మెన్. 1985 నుంచి తాడిపత్రి నుంచి 6 సార్లు గెలిచిన ఎమ్మెల్యే. 2014లో అనంతపురం నుంచి గెలిచిన ఎంపీ. కాంట్రవర్షియల్ స్టేట్ మెంట్స్ కేరాఫ్ జేసీ దివాకర్ రెడ్డి. ఆయన పొలిటికల్ ట్రాక్ రికార్డు… ఇతర యాక్టివిటీస్ సంగతి పక్కనపెడితే.. ఇపుడు రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. జగన్ సీఎం అయ్యాక దివాకర్ రెడ్డి పరిస్థితి దారుణంగా మారిపోయింది. వైఎస్ మరణానంతరం, టీడీపీ ఎంపీగా ఉన్న టైంలో జగన్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేవారు జేసీ. పొలిటికల్ బచ్చాగా ట్రీట్ చేసేవారు. వైఎస్ జగన్ ఎప్పుడైతే అధికారంలోకొచ్చారో.. ఆయన్ని జోకడం మొదలుపెట్టారు. కానీ జగన్ కరగలేదు. దివాకర్ ట్రావెల్స్ బస్సుల సీజ్ దగ్గర్నుంచి ఆ ట్రావెల్స్ పేరుతో జేసీ చేసిన అక్రమాలన్నింటినీ తవ్వి తీస్తోంది జగన్ ప్రభుత్వం. ఇన్సూరెన్స్ లేని, సరైన పత్రాలు లేని.. ఏ చిన్న లూప్ హోల్ దొరికినా సరే సీజ్ చేసి పడేస్తున్నారు అధికారులు. ఇవన్నీ బయటకు కనిపిస్తున్న సీన్స్. కానీ జేసీని జగన్ తొక్కుతున్న తీరు అంతకుమించే అంటున్నారు. లోలోపల రగిలిపోతున్నా.. చేసేదేం లేక అన్నీ దిగమింగుకుంటున్నార జేసీ బ్రదర్స్.

నిజానికి తన తండ్రి వైఎస్ఆర్… అటు అనంతపురంలో ఇటు రాష్ట్ర రాజకీయాల్లో జేసీ బ్రదర్స్ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నించారు. కానీ కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువ కదా. పైగా సీనియర్ మోస్ట్ కావడంతో హైకమాండ్ వైఎస్ ను కంట్రోల్ చేసింది. 2004లో తన కేబినెట్ లో జేసీకి మంత్రిగా ఛాన్సిచ్చారు వైఎస్. హైకమాండ్ ఆదేశాల మేరకే సుమా. అయితే రెండోసారి అధికారంలోకొచ్చాక మంత్రిగా తీసుకోలేదు. దాంతో రగిలిపోయిన జేసీ… వైఎస్ కు వ్యతిరేకంగా పావులు కదపడం మొదలుపెట్టారు. ఆయన హఠాత్మరణం తర్వాత ఆ అక్కసంతా జగన్ మీద చూపించడం మొదలుపెట్టారు. అయినా ఏనాడూ జగన్ జేసీ మీద నోరు జారలేదు. అన్నింటికి మించి తన తాత రాజారెడ్డి కాలం నుంచే జేసీ ఫ్యామిలీతో వైరం. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే కావచ్చు… జేసీని జగన్ టార్గెట్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఆర్థికంగా, రాజకీయంగా కోలుకోకుండా దెబ్బతీయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. నిజానికి 2014 నుంచే జేసీకి జగన్ చెక్ పెడుతూ వచ్చారు. జేసీకి వ్యతిరేకంగా తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని మొహరించారు. దశాబ్దాలుగా జేసీ బ్రదర్స్ అరాచకాలకు బలైన వ్యక్తి కేతిరెడ్డి పెద్దారెడ్డి. జగన్ కేతిరెడ్డికి అన్ని విధాలా అండదండలు అందించడంతో జేసీకి ఉక్కపోత మొదలైంది. దానికితోడు ప్రస్తుత హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్… సీఐగా ఉన్నప్పుడు జేసీతో జరిగిన గొడవ గురించి తెలిసిందేగా. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎంపీని చేశారు జగన్. అలా అన్ని రకాలుగా అనంతపురంలో జేసీకి గ్రిప్ లేకుండా చేశారు. ఆయన వారసులకు సైతం ఛాన్స్ లేకుండా దెబ్బకొట్టారు. నిజానికి ట్రావెల్స్ బిజినెస్, మైనింగ్ లో కోట్లాది రూపాయలు పోగేసుకుంది జేసీ ఫ్యామిలీ. రాష్ట్రంలో అత్యంత ఖరీదైన కార్లు జేసీ ఇంటిముందు ఆగుతుంటాయి. బుగాటీ, లాంబోర్గినీ టైపు లగ్జరీ కార్లలో జేసీ దివాకర్ రెడ్డి సెక్రెటేరియట్ కు వచ్చిన సందర్బాలున్నాయి. అలాంటి వ్యక్తికి  ఇపుడు దిక్కులేకుండా పోయింది. చెప్పుకోవడానికి చంద్రబాబుకు అధికారం లేదు. జోకుదామన్నా జగన్ పట్టించుకోడు. టీడీపీ హయాంలో తనకున్న రాజకీయ ప్రాబల్యంతో ఇష్టానుసారం చెలరేగిపోయారు. కానీ జగన్ జగమొండి కదా. చంద్రబాబు మాటల్లో చెప్పాలంటే వైఎస్ఆర్ జగన్ కంటే వెయ్యి రెట్లు బెటర్. వైఎస్ కున్నంత సానుభూతి, లైట్ తీస్కునే తత్వం జగన్ లో లేదని అంటారు కదా. జేసీ విషయంలో దాన్ని క్లియర్ గా చూపిస్తున్నారన్నమాట జగన్. అనంత రాజకీయాల్లో ఇక జేసీది గత చరిత్రేనా ?