Guvvala Balaraju :అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. అనంతరం మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ నాయకుడిగా తనకంటే చిన్నవాడని, అతనికి ఏ మాత్రం అనుభవం లేదన్నారు. నా కంటే కేటీఆర్ పెద్దోడేమీ కాదు.. ఎదిగిన సామాజిక వర్గం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఆమెరికాలో చదువుకుకున్నారు. ఆయనకున్న స్కిల్ నాకు లేకపోవచ్చు. ఆకట్టకునే ప్రసంగాలు చేయకపోవచ్చు. కానీ నేను చూసిన ఆకలి మంటలు ఆయన చూడలేదు. నా అంత అనుభవం ఆయనకు లేదంటూ వ్యాఖ్యనించారు.
ఇక ముందే తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తే వ్యక్తిత్వ హననం చేస్తారని.. ఎవరితో సంప్రదింపులు జరుపకుండా బీఆర్ఎస్ కు రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు. కేటీఆర్ అచ్చంపేట నియోజకవర్గంలో అడుగుపెడితే, ప్రజలు కర్రలతో తరిమి కొడతారని ఆయన హెచ్చరించారు. బీఆర్ఎస్లో కేటీఆర్ దళితులను, వెనుకబడిన వర్గాలను అవమానించారని, తనకు కూడా తీవ్ర అవమానాలు ఎదురయ్యాయని ఆరోపించారు.
బీఆర్ఎస్లో తనకు గౌరవం లేదని, దళితుల పక్షాన నిలబడటానికి బీజేపీ సరైన వేదిక అని భావించి తాను బీజేపీలో చేరానని గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో పెద్ద చర్చకు దారితీశాయి. గువ్వల బాలరాజు రెండుసార్లు (2014, 2018) అచ్చంపేట నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో టీడీపీ అభ్యర్థి పి.రాములును, 2018లో కాంగ్రెస్ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణను ఓడించారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణ చేతిలో ఓటమి పాలయ్యారు.భవిష్యత్తులో అచ్చంపేట నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.