Auto Driver : తమిళనాడుకు చెందిన మహిళా ఆటో డ్రైవర్ రాజీ మానవత్వం, గొప్ప మనసు ఇప్పుడు అందరి హృదయాలను గెలుచుకుంది. రాత్రి వేళల్లో ఎంతోమంది మహిళలను సురక్షితంగా ఇంటికి చేర్చుతున్న ఈ లేడీ ఆటో డ్రైవర్ కు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. దాదాపుగా 20 ఏళ్ల ఆటో నడుపుతూ అందరి అభిమానాన్ని పొందుతుంది. మహిళలకు అర్థరాత్రి ఎలాంటి ఆపద వచ్చిన ఆమె ఆటో సిద్ధంగా ఉంటుంది. ఎంతోమంది పిల్లలు, వృద్ధులకు ఆటోలో ఉచిత ప్రయాణాన్ని అందిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది. ఈమె గురించి ఇప్పుడు నెట్టింట చర్చ నడుస్తోంది.
కేరళలోని వయనాడ్లో ఇటీవల సంభవించిన కొండచరియలు విరిగిపడిన సంఘటనలో ఆమె చూపిన ఉదారత, సహాయం అందరినీ ఆశ్చర్యపరిచింది. రాజీ చెన్నైలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంది. ఆమె సొంతంగా ఒక ఇల్లు కట్టుకోవడానికి చాలా కాలంగా డబ్బులు పొదుపు చేసుకుంది. అయితే, వయనాడ్లో సంభవించిన ప్రకృతి వైపరీత్యాన్ని చూసి చలించిపోయిన ఆమె, కట్టుకుంటున్న ఇంటి పనిని తాత్కాలికంగా ఆపివేసి, తన పొదుపులో నుంచి లక్ష రూపాయలను విరాళంగా ఇచ్చేసింది.
ఈ మొత్తాన్ని ఆమె కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేసింది. కేవలం ఆటో డ్రైవర్గా ఉండే ఒక సామాన్య మహిళ ఇంత పెద్ద మొత్తాన్ని విరాళంగా ఇవ్వడం నిజంగా గొప్ప విషయం. ఆమె చేసిన ఈ పని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడానికి హోదా, డబ్బు ముఖ్యం కాదని, కేవలం మంచి మనసు ఉంటే చాలని రాజీ నిరూపించారు.