BIG BREAKING : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) నివాసం వద్ద భద్రతా వైఫల్యం కలకలం రేపింది. ఒహియోలోని సిన్సినాటిలో ఉన్న ఆయన నివాసం వద్దకు ఒక ఆగంతకుడు చొరబడటానికి ప్రయత్నించాడు. అంతేకాకుండా అతని ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసం కావడంతో అమెరికన్ సీక్రెట్ సర్వీస్, స్థానిక పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.
సిన్సినాటిలోని ‘ఈస్ట్ వాల్నట్ హిల్స్’ ప్రాంతంలో ఉన్న వాన్స్ నివాసం వద్ద సోమవారం తెల్లవారుజామున సుమారు 12:15 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఒక వ్యక్తి అనుమానాస్పదంగా పరుగెత్తుతుండటాన్ని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో ఇంటి కిటికీలు పగిలి ఉండటాన్ని అధికారులు గమనించారు. అయితే ఆ అద్దాలు ఎలా పగిలాయి? ఆగంతకుడు లోపలికి ప్రవేశించాడా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అదృష్టవశాత్తూ ప్రమాదం జరిగిన సమయంలో జేడీ వాన్స్ కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేరని అధికారులు వెల్లడించారు. నిందితుడి ఉద్దేశం ఏమిటనే దానిపై దర్యాప్తు జరుగుతోందని, ప్రస్తుతానికి ఎలాంటి ముప్పు లేదని భద్రతా సంస్థలు వెల్లడించాయి. అమెరికాలో అగ్రనేతల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది.
