Anantapur : అనంతపురం జిల్లా ఉరవకొండలో అమానుష ఘటన చోటుచేసుకుంది. కులం కట్టుబాటు కాదని పక్క ఊరిలో సంబంధం కుదుర్చుకున్న ఓ కుటుంబాన్ని వెలి వేశారు. బాధితుల ప్రకారం.. ఉరవకొండ శివరామిరెడ్డి కాలనీకి చెందిన జోగి వెంకటేష్ కుమారుడు జోగి మణికుమార్‌కు కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది. అందులో భాగంగానే ఎంగేజ్ మెంట్ కూడా చేశారు ఇరు కుటుంబ పెద్దలు.
అయితే ఈ విషయం సంచార జాతుల కులపెద్దలకు తెలియడంతో వారు పంచాయితీ ఏర్పాటు చేశారు. కులస్తులకు కర్ణాటక వారితో ఇప్పటివరకు ఎలాంటి వివాహ సంబంధాల్లేవని, మీరెలా చేసుకుంటారని ప్రశ్నించారు.వెంటనే ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే మీ కుటుంబాన్ని 30 ఏళ్ల పాటు కులం నుంచి వెలివేస్తామని హెచ్చరించారు.
అంతేకాకుండా ఉరవకొండ నుంచి నిశ్చితార్థానికి వెళ్లిన వారు ఒక్కొక్కరు రూ.1,200 చొప్పున సంఘానికి జరిమానా చెల్లించాలని హుకుం జారీచేశారు. ఆ ఇంట్లో మంచి నీళ్లు తాగితే రూ. లక్ష జరిమానా ప్రకటన కూడా చేశారు. దీంతో బాధితులు జిల్లా కలెక్టర్, పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై అబ్బాయి తండ్రి వెంకటేష్ స్పందిస్తూ.. సమాజం ఇంత అభివృద్ధి చెందుతున్నా కులపెద్దలు, కట్టుబాట్లు అంటూ ఇంకా ఎంతకాలం హింసిస్తారని అసహనం వ్యక్తం చేశారు.
Also Read :