Iranian Rial : ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో డాలర్ విలువతో పోలిస్తే మన రూపాయి విలువ తగ్గుతోందని మనం కంగారు పడుతుంటాం. కానీ, మన పొరుగునే ఉన్న ఇరాన్ దేశం పరిస్థితి చూస్తే మాత్రం ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. అక్కడ కరెన్సీ విలువ ఎంతలా పడిపోయిందంటే, ఒక సామాన్య భారతీయుడు తన జేబులో ఒక పదివేల రూపాయలు పట్టుకుని ఇరాన్ వెళ్తే, అక్కడ అతను లక్షాధికారి కాదు, ఏకంగా కోటీశ్వరుడు అయిపోతాడు! అవును, ఇది నిజం. ఇరాన్ కరెన్సీ ‘రియాల్’ విలువ పాతాళానికి పడిపోవడంతో అక్కడి ఆర్థిక వ్యవస్థ వింతగా మారిపోయింది.
మన రూపాయి.. అక్కడ వేలల్లో!
సాధారణంగా మనం విదేశాలకు వెళ్లినప్పుడు మన రూపాయి విలువ తక్కువగా ఉంటుంది. కానీ ఇరాన్ విషయంలో మాత్రం లెక్క మొత్తం రివర్స్. ప్రస్తుతం ఒక భారతీయ రూపాయికి ఇరాన్ మార్కెట్లో సుమారు 500 నుండి 600 రియాల్స్ వరకు వస్తాయి. అంటే మీరు ఒక వంద రూపాయల నోటు ఇస్తే, బదులుగా మీకు అక్కడ 50 వేల రియాల్స్ వస్తాయి. ఒక వెయ్యి రూపాయలు ఇస్తే ఏకంగా 5 లక్షల రియాల్స్ మీ జేబులోకి వస్తాయి. ఈ లెక్కన ఒక సగటు భారతీయుడికి ఇరాన్ ఒక ‘కోటీశ్వరుల స్వర్గం’లా కనిపిస్తుంది.
ఒక కప్పు టీ తాగాలన్నా వేలల్లోనే..
కరెన్సీ విలువ ఇంతలా పడిపోవడంతో అక్కడి వస్తువుల ధరలు కూడా వేలల్లో, లక్షల్లో ఉంటాయి. మనం ఇక్కడ పది రూపాయలకు తాగే టీ, అక్కడ తాగాలంటే వేల రియాల్స్ చెల్లించాలి. ఒక సాధారణ హోటల్లో భోజనం చేయాలన్నా లక్షల రియాల్స్ లెక్క కట్టాల్సిందే. బజారుకు వెళ్లి కూరగాయలు కొనాలన్నా సంచుల కొద్దీ కరెన్సీ నోట్లు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. నిజానికి ఇరాన్ ప్రజలు ఈ గందరగోళం నుంచి తప్పించుకోవడానికి ‘రియాల్’ బదులు ‘తోమన్’ అనే పదాన్ని వాడుకలోకి తెచ్చారు. అంటే ఒక తోమన్ అంటే 10 రియాల్స్ అన్నమాట. సులభంగా ఉండటానికి పది రియాల్స్లో ఒక సున్నా తీసేసి లెక్కగడుతుంటారు.
ఎందుకింత దారుణం?
ఇరాన్ కరెన్సీ ఇలా కుప్పకూలడానికి ప్రధాన కారణం అమెరికా విధించిన కఠినమైన ఆర్థిక ఆంక్షలు. ఇరాన్ అణు కార్యక్రమాల కారణంగా అమెరికా ఆ దేశంతో వ్యాపార సంబంధాలను కట్ చేసింది. దీనివల్ల ఇరాన్ నుంచి చమురు ఎగుమతులు తగ్గిపోయి, డాలర్ల కొరత ఏర్పడింది. ఒక్క అమెరికా డాలర్ విలువ ఇరాన్ ఓపెన్ మార్కెట్లో దాదాపు 6 లక్షల రియాల్స్ దాటిపోయింది. దీనికి తోడు యుద్ధ మేఘాలు, అంతర్గత అలజడులు ఆ దేశ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చాయి.
పర్యాటకులకు పండగే కానీ..
భారతీయ పర్యాటకులకు ఇరాన్ వెళ్లడం చాలా చౌకైన వ్యవహారం. మన కరెన్సీకి అక్కడ విపరీతమైన విలువ ఉండటంతో తక్కువ ఖర్చుతోనే రాజ భోగం అనుభవించవచ్చు. కానీ, అక్కడి సామాన్య ప్రజలకు మాత్రం ఇది ఒక పీడకల. రోజువారీ వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడం, నిరుద్యోగం పెరగడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనం కోటీశ్వరులం అయిపోతామని సంబరపడినా, ఇరాన్ గడ్డ మీద అడుగుపెడితే ఆ కరెన్సీ లెక్కలు తేల్చడానికి కాలిక్యులేటర్ కూడా సరిపోని పరిస్థితి ఉంటుంది!
