లేహ్ లో అల్లర్లకు రెచ్చగొట్టారన్న ఆరోపణలతో అరెస్టైన లద్దాఖ్ ఉద్యమ నేత సోనమ్ వాంగ్ చుక్ భార్య గీతాంజలి జే ఆంగ్మో.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన భర్తను విడుదల చేయాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు తన భర్తను విడుదల చేయాలంటూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీకి, కేంద్రమంత్రి అమిత్ షాకు ఆమె లేఖ రాశారు.
వాంగ్ చుక్ కు పాక్ తో ఎలాంటి సంబంధాలు లేవని ఆమె అన్నారు. వాంగ్ చుక్ ఉద్యమ స్ఫూర్తిని చంపేందుకు కొంతకాలంగా కుట్రలు జరుగుతున్నాయని గీతాంజలి ఆరోపించారు. సెప్టెంబరు 26న అరెస్ట్ చేసిన తర్వాత ఇంతవరకు తన భర్తతో మాట్లాడనివ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తన భర్తతో మాట్లాడే హక్కు తనకు లేదా? ఆయనకు న్యాయపరమైన హక్కులు కల్పించేందుకు సాయం చేయకూడదా? అని గీతాంజలి ప్రశ్నించారు.
లేహ్ లో జరిగిన అల్లర్లలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 90 మందికి పైగా గాయపడ్డారు. వాంగ్ చుక్ పిలుపుతోనే ఈ ఆందోళనలు జరిగాయని పోలీసులు చెబుతున్నారు. ఆయనకు పాక్ తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నట్లు లద్దాఖ్ డీజీపీ చెప్పారు. ఐతే పోలీసుల ఆరోపణలు అబద్ధమని లద్ధాఖ్ లో పలుచోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి.