Monalisa Marriage : కుంభమేళా ఫోటోలతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన మొనాలిసా, తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను కేరళలో వివాహం చేసుకోబోతున్నారు. తిరువనంతపురంలోని పూవార్ అరుమానూర్ నైనార్ ఆలయంలో వీరిద్దరి పెళ్లి జరగనుంది. ఈ వివాహ వేడుకకు కేరళ మంత్రి వి.శివన్ కుట్టి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్, జిల్లా కార్యదర్శి ఏఏ రహీమ్ వంటి ప్రముఖులు హాజరు కాబోతుండటం విశేషం.
వీరిద్దరి ప్రేమకు తమ సొంత రాష్ట్రాల్లో ఇంట్లో వారు అంగీకరించకపోవడంతో, సురక్షితమైన ప్రాంతం కోసం వెతుక్కుంటూ వీరు కేరళకు చేరుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన మొనాలిసా మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్ తమ వివాహం కోసం దేశంలోనే అత్యంత అనువైన ప్రదేశంగా కేరళను ఎంచుకున్నట్లు సీపీఎం నేత గోవిందన్ తెలిపారు. ఇద్దరు వ్యక్తులు తమకు నచ్చిన విధంగా జీవించే హక్కు ఉందని, అందుకే తాము ఈ జంటకు మద్దతు ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
అంతకుముందు మొనాలిసా కుటుంబ సభ్యులు వీరి బంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా, ఆమె తండ్రి బలవంతంగా మరో పెళ్లి చేయాలని ప్రయత్నించారు. దీంతో ఆమె తిరువనంతపురం పోలీసులను ఆశ్రయించి తన గోడును వెల్లడించింది. పోలీసులు వీరికి పూర్తి రక్షణ, చట్టపరమైన సహాయం అందిస్తామని హామీ ఇవ్వడంతో, ఇప్పుడు వీరిద్దరూ హిందూ సంప్రదాయం ప్రకారం ఆలయంలో ఒక్కటవుతున్నారు.
