Testosterone Symptoms: మగాళ్లలో టెస్టోస్టిరాన్ తగ్గితే అంతే సంగతులా..మరి ఎలా పెంచుకోవాలి?

low testosterone symptoms in men

Testosterone Symptoms : ప్రస్తుత కాలంలో చాలామంది పురుషులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య హార్మోన్ల అసమతుల్యత. ముఖ్యంగా మగవారిలో టెస్టోస్టెరాన్(Testosterone Symptoms), హార్మోన్ స్థాయిలు దారుణంగా పడిపోతున్నాయి. ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలో కనిపించే ఈ సమస్య, నేడు 20 ఏళ్ల యువకుల్లో కూడా కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. మన మారిన ఆహారపు అలవాట్లు, విపరీతమైన పని ఒత్తిడి, సరైన నిద్ర లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అసలు మీ శరీరంలో టెస్టోస్టెరాన్ తగ్గుతుందని ఎలా తెలుసుకోవాలంటే దీనికి కొన్ని స్పష్టమైన సంకేతాలు ఉంటాయి. మునుపటిలా ఉత్సాహంగా లేకపోవడం, రోజంతా విపరీతమైన నీరసంగా అనిపించడం, చిన్న పనికే త్వరగా అలసిపోవడం వంటివి దీని మొదటి లక్షణాలు. అలాగే, మానసిక స్థితిలో మార్పులు రావడం, ఏ చిన్న విషయానికైనా విపరీతమైన చిరాకు పడటం, ఏకాగ్రత దెబ్బతినడం కూడా హార్మోన్ల లోపాన్ని సూచిస్తాయి. ముఖ్యంగా శృంగారం పట్ల ఆసక్తి తగ్గడం, అంగస్తంభన సమస్యలు తలెత్తుతుంటే మీ శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిలు పడిపోయాయని అర్థం చేసుకోవాలి.

శరీర ఆకృతిలో వచ్చే మార్పులను కూడా గమనించాలి. కండరాలు కరిగిపోతూ, పొట్ట భాగంలో కొవ్వు పెరగడం, రొమ్ము భాగం వాపు రావడం వంటివి టెస్టోస్టెరాన్ లోపం వల్ల జరుగుతాయి. చాలామంది జిమ్‌కు వెళ్లి కష్టపడినా ఫలితం లేదంటే దానికి కారణం ఈ హార్మోన్ తక్కువగా ఉండటమే. ఇది కేవలం శారీరక సమస్యే కాదు, ఎముకల సాంద్రతను కూడా తగ్గిస్తుంది, దీనివల్ల భవిష్యత్తులో ఎముకలు త్వరగా విరిగే ప్రమాదం ఉంటుంది.

అయితే, ఈ సమస్యను చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. కేవలం మన జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా దీనిని సహజంగానే పెంచుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయం కాసేపు ఎండలో గడపడం వల్ల శరీరానికి అందే విటమిన్-డి, టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఆహారంలో జింక్ ఎక్కువగా ఉండే గుమ్మడి గింజలు, బాదం, మాంసం, గుడ్లను చేర్చుకోవాలి. ముఖ్యంగా రాత్రిపూట కనీసం 7 నుండి 8 గంటల గాఢ నిద్ర తప్పనిసరి. ఎందుకంటే మనం నిద్రపోతున్నప్పుడే మన శరీరం హార్మోన్లను రీఛార్జ్ చేసుకుంటుంది.

వ్యాయామం విషయానికి వస్తే, కేవలం నడక లేదా పరుగు మాత్రమే కాకుండా కొంచెం బరువులు ఎత్తే వ్యాయామాలు చేయడం వల్ల టెస్టోస్టెరాన్ వేగంగా పెరుగుతుంది. విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నప్పుడు శరీరంలో కార్టిసోల్ అనే హార్మోన్ విడుదలవుతుంది, ఇది టెస్టోస్టెరాన్‌ను నాశనం చేస్తుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకుంటే కేవలం మూడు నెలల్లోనే మీ శరీరంలో మార్పును గమనించవచ్చు.