KCR : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంట్లో ఇప్పుడు రాజకీయ సెగలు మొదలయ్యాయి. ఆయన కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. అయితే ఆమె మామగారి బాటలో కాకుండా, ప్రత్యర్థి పార్టీ అయిన బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
రాజకీయాల్లోకి రావాలనేది తన చిరకాల కోరిక అని ప్రీతిరెడ్డి ఒక ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టారు. మహిళలు రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా జాతీయ స్థాయిలో సమస్యలపై పోరాడాలనేది తన లక్ష్యమని ఆమె చెప్పుకొచ్చారు. తనకు తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, కన్నడ భాషలు కూడా వచ్చని.. అవకాశం వస్తే ఎంపీగా పోటీ చేస్తానని తన మనసులోని మాటను బయటపెట్టారు.
ప్రస్తుతం ఆమె ఏ పార్టీలో చేరుతారనేది అధికారికంగా ప్రకటించకపోయినా, ఆమె మాటలు మాత్రం బీజేపీ వైపు వెళ్తున్నట్లు సూచిస్తున్నాయి. ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీపై ఆమె ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా, హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చాలంటూ మోదీకి మద్దతు తెలపడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతేడాది కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కూడా ఆమె కలవడం ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది.
మరోవైపు మల్లారెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇంట్లోనే భిన్నమైన రాజకీయ ధోరణులు కనిపిస్తుండటంతో మల్లారెడ్డి కుటుంబం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. కోడలు బీజేపీలోకి వెళ్తే మల్లారెడ్డి పరిస్థితి ఏంటన్నది నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.
