Hyderabad : హైదరాబాద్‌లో దోశ, పూరి బంద్.. హోటళ్లు, హాస్టళ్లు క్లోజ్!

Hyderabad

Hyderabad :  హైదరాబాద్ ఐటీ కారిడార్‌తో పాటు నగరంలోని మెస్‌లు, హాస్టళ్లలో టిఫిన్ల సందడి తగ్గనుంది. ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాలో తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో వంట గ్యాస్ దొరకక హోటళ్లు, పీజీ హాస్టళ్లు తమ మెనూను భారీగా కుదించేశాయి. ఎక్కువ సమయం గ్యాస్ తీసుకునే దోశ, పూరి, వడ, చపాతీ వంటి ఐటమ్స్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ ఐటీ కారిడార్ హోటళ్ల అసోసియేషన్ ప్రకటించింది.

అన్నం, సాంబార్‌తోనే సరిపెట్టుకోవాలి!

చాలా హాస్టళ్లు, మెస్‌లలో గ్యాస్ ఆదా చేసేందుకు కేవలం అన్నం, సాంబార్, పప్పు, రసం వంటి త్వరగా ఉడికే వంటలనే వడ్డిస్తున్నారు. టీ, కాఫీ తయారీని కూడా తగ్గించేశారు. ఒకవేళ మరో రెండు, మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే గ్యాస్ సిలిండర్లు దొరక్క హాస్టళ్లను తాత్కాలికంగా మూసివేయడం తప్పదని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని హాస్టల్స్ తమ బోర్డర్లకు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి.

మరోవైపు, రవాణా ఛార్జీలు పెరగడం మరియు గ్యాస్ కొరత కారణంగా నగరంలోని పెద్ద హోటళ్లు తమ ధరలను పెంచేశాయి. దోశ, పూరి, వడలపై కనీసం రూ.15, ఇడ్లీ మరియు ఉప్మా వంటి వాటిపై కనీసం రూ.10 వరకు ధరలు పెరిగాయి. సామాన్యుడు బయట టిఫిన్ చేయాలన్నా ఇప్పుడు జేబుకు చిల్లు పడాల్సిందే. గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ ఇబ్బందులు తప్పేలా లేవు.