Indian Railways : రైలు ప్రయాణికులకు షాకిస్తూ భారతీయ రైల్వే శాఖ టిక్కెట్ క్యాన్సిలేషన్, రీఫండ్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. 2026 నుంచి అమలులోకి రానున్న ఈ కొత్త రూల్స్ ప్రకారం, ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే వెనక్కి వచ్చే డబ్బులో భారీగా కోత పడనుంది. గతంలో ఉన్న వెసులుబాటును తగ్గిస్తూ, రైలు బయలుదేరే సమయానికి ఎంత ముందుగా క్యాన్సిల్ చేసుకుంటే అంత ఎక్కువ డబ్బు వస్తుందని, ఆలస్యం చేస్తే మాత్రం ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదని రైల్వే స్పష్టం చేసింది.
ముఖ్యంగా కన్ఫర్మ్ అయిన టిక్కెట్లను రద్దు చేసుకునే సమయాన్ని బట్టి ఈ తగ్గింపులు ఉంటాయి. ఒకవేళ మీరు రైలు బయలుదేరడానికి 72 గంటల కంటే ముందే టిక్కెట్ క్యాన్సిల్ చేస్తే, నామమాత్రపు ఛార్జీలు మినహాయించి మిగతా సొమ్ము అంతా తిరిగి వస్తుంది. కానీ, 72 గంటల నుండి 24 గంటల మధ్యలో రద్దు చేస్తే టిక్కెట్ ధరలో 25 శాతం కట్ చేస్తారు. అలాగే, రైలు టైమ్‌కు 24 గంటల నుండి 8 గంటల ముందు వరకు టిక్కెట్ క్యాన్సిల్ చేసుకుంటే సగం డబ్బులు అంటే 50 శాతం కోత విధిస్తారు.
ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, రైలు బయలుదేరడానికి 8 గంటల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు టిక్కెట్ రద్దు చేస్తే అసలు ఒక్క పైసా కూడా వెనక్కి రాదు. ఈ కొత్త రూల్స్ కౌంటర్ టిక్కెట్లకు, ఆన్లైన్ ఇ-టిక్కెట్లకు రెండింటికీ వర్తిస్తాయి.
మరోవైపు, టిక్కెట్ బుకింగ్ పద్ధతుల్లో కూడా రైల్వే శాఖ ఇప్పటికే కొన్ని కఠినమైన మార్పులను అమల్లోకి తెచ్చింది. సామాన్య ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా, దళారుల ఆగడాలను అరికట్టడానికి ఆధార్ వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేసింది. 2025 అక్టోబర్ 1 నుండి అమల్లోకి వచ్చిన నిబంధన ప్రకారం, ఐఆర్సిటిసి వెబ్సైట్ లేదా యాప్‌లో బుకింగ్ మొదలైన మొదటి 15 నిమిషాల్లో టిక్కెట్ బుక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేయాల్సిందే. అంతకుముందే అంటే 2025 జూలై నుండే తత్కాల్ టిక్కెట్లకు కూడా ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి చేశారు.
దీంతో పాటు తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ విషయంలో ఏజెంట్లపై కూడా కొన్ని ఆంక్షలు విధించారు. తత్కాల్ బుకింగ్ ప్రారంభమైన మొదటి 30 నిమిషాల పాటు రైల్వే ఏజెంట్లు టిక్కెట్లు బుక్ చేయడానికి వీలుండదు. అంటే ఏసీ క్లాసులకు ఉదయం 10 నుండి 10:30 వరకు, నాన్-ఏసీ క్లాసులకు 11 నుండి 11:30 వరకు ఏజెంట్లు టిక్కెట్లు తీయలేరు. దీనివల్ల సాధారణ ప్రజలకు తత్కాల్ టిక్కెట్లు సులువుగా దొరుకుతాయని రైల్వే భావిస్తోంది. మొత్తం మీద రైలు ప్రయాణాన్ని పక్కాగా ప్లాన్ చేసుకోకపోతే ప్రయాణికులు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని ఈ కొత్త మార్పులు హెచ్చరిస్తున్నాయి.
