Agnimitra Paul : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చారిత్రాత్మక విజయం సాధించి, తొలిసారిగా అధికారాన్ని కైవసం చేసుకున్న నేపథ్యంలో.. ఇప్పుడు అందరి దృష్టి తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపైనే నెలకొంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పాలనకు ముగింపు పలికి, రాష్ట్రాన్ని ముందుకు నడిపించే ఆ నాయకుడు ఎవరన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ రేసులో ముఖ్యంగా సువేందు అధికారి, అగ్నిమిత్ర పాల్, రూప గంగూలీ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
ఈ ముగ్గురిలో సువేందు అధికారి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. భవానీపూర్ నియోజకవర్గంలో స్వయంగా మమతా బెనర్జీని 15 వేల ఓట్ల తేడాతో ఓడించి ఆయన ‘జెయింట్ కిల్లర్’గా పేరు తెచ్చుకున్నారు. గతంలో తృణమూల్ కాంగ్రెస్‌లో మమతకు అత్యంత సన్నిహితుడిగా, ఆమె ముఖ్య అనుచరుడిగా ఉన్న సువేందు, తర్వాత బీజేపీలో చేరి ఆమెకే సవాలు విసిరారు. చిన్నతనంలోనే ఆర్‌ఎస్‌ఎస్ శాఖల్లో శిక్షణ పొందిన ఆయన, 1980లలో విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1995లో తన తండ్రి శిశిర్ అధికారి నేతృత్వంలోని కాంతి మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా గెలిచిన ఆయన, 1999లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. 2021లో నందిగ్రామ్ విజయం తర్వాత ఆయన ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు మమతనే ఓడించడంతో బీజేపీ అధిష్టానం వద్ద ఆయన పరపతి మరింత పెరిగింది.
మరోవైపు ఫైర్‌బ్రాండ్ నాయకురాలిగా పేరున్న అగ్నిమిత్ర పాల్ కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. 2019లో బీజేపీలో చేరిన ఆమె, అతి తక్కువ కాలంలోనే మహిళా మోర్చా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 23 జిల్లాల్లో మహిళలకు ఆత్మరక్షణ శిక్షణ తరగతులు నిర్వహించి మంచి గుర్తింపు పొందారు. గతంలో ఫ్యాషన్ డిజైనర్‌గా రాణించిన అగ్నిమిత్ర, బాలీవుడ్ సినిమాలకు కూడా పనిచేశారు. 2000వ సంవత్సరంలో శ్రీదేవి ప్రోత్సాహంతో ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ‘కోయి మేరే దిల్ సే పూచే’, ‘వయా డార్జిలింగ్’ వంటి చిత్రాలకు ఆమె దుస్తులు డిజైన్ చేశారు.
ఆమె ‘Inga’ అనే పేరుతో తన సొంత ఫ్యాషన్ బ్రాండ్‌ను నడుపుతున్నారు. మిథున్ చక్రవర్తి, శ్రీదేవి, కజోల్ వంటి దిగ్గజ నటీనటులకు ఆమె డిజైనర్‌గా పనిచేశారు. ఆమె పారిశ్రామికవేత్త పార్థో పాల్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 2021లో అసన్సోల్ దక్షిణ నియోజకవర్గం నుండి సయోని ఘోష్‌ను ఓడించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆమె, ప్రస్తుతం బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. తన దూకుడు స్వభావంతో పార్టీలో ఆమె ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
వీరితో పాటు సీనియర్ నాయకురాలు రూప గంగూలీ పేరు కూడా పరిశీలనలో ఉంది. సోనార్‌పూర్ దక్షిణ నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఆమె, తృణమూల్ అభ్యర్థి అరుంధతి మైత్రాపై 35 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. బి.ఆర్. చోప్రా ‘మహాభారతం’ సీరియల్‌లో ద్రౌపది పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రూప గంగూలీ, 2015లో బీజేపీలో చేరారు. ఆమె గతంలో రాజ్యసభ సభ్యురాలిగా కూడా పనిచేశారు. ప్రజాదరణ ఉన్న నాయకురాలిగా ఆమెకు మంచి పేరు ఉంది. ఈ ముగ్గురు కీలక నాయకుల్లో బెంగాల్ పగ్గాలను బీజేపీ ఎవరికి అప్పగిస్తుందో చూడాలి.
