kaleshwaram : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరంలో జరిగిన అవకతవకలపై విచారణను సీబీఐకి అప్పగించింది రేవంత్ సర్కార్. రాష్ట్ర సంస్థలతో దర్యాప్తు చేయిస్తే…మా చిత్తశుద్ధిని శంకిస్తారు అందుకే సీబీఐకి అప్పగిస్తున్నామని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ ప్రకటించారు.
కాంట్రాక్టర్ల కమీషన్లకు కేసీఆర్ కక్కర్తి పడ్డారంటూ సీఎం ఆరోపించారు. ప్రాజెక్టు వ్యయాన్ని రూ. 38 వేల నుంచి.. రూ. 1.47లక్ష కోట్లకు పెంచారన్నారు. రీడిజైన్ పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు కొల్లగొట్టారని సీఎం ఆరోపించారు. అర్ధరాత్రి దాటాక కూడా జరిగిన సభ.. సీఎం ప్రకటన అనంతరం నిరవధిక వాయిదా పడింది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం CID లేదా సిట్ ద్వారా విచారణ చేపట్టే అవకాశముందని అందరూ భావించారు. కానీ ప్రభుత్వం ఈ కేసును CBIకి అప్పగించాలని అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఒకవేళ మాజీ సీఎం KCR అరెస్ట్ అయితే కక్షపూరిత చర్యలు తీసుకుందనే అపవాదు రాకుండా జాగ్రత్త పడినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థకు కేసును అప్పగించాలని నిర్ణయించిందని చెబుతున్నారు.
