BIG BREAKING : ఏపీలో సోషల్ మీడియా బ్యాన్!

BIG BREAKING

BIG BREAKING : ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని బ్యాన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచిస్తోంది. ప్రస్తుతం దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ ఈ విషయాన్ని చెప్పారు. ఆస్ట్రేలియా దేశం ఇప్పటికే 16 ఏళ్ల లోపు పిల్లల కోసం ఇలాంటి ఒక కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు మన ఏపీ ప్రభుత్వం కూడా ఆ చట్టం గురించి అధ్యయనం చేస్తోందని లోకేష్ వెల్లడించారు.

చిన్న వయసులో పిల్లలకు సోషల్ మీడియాలో వచ్చే విషయాల మీద సరైన అవగాహన ఉండదని లోకేష్ అభిప్రాయపడ్డారు. వారు చూసే కంటెంట్ వల్ల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో వాళ్లకు తెలియదని, అందుకే ఒక వయసు వచ్చే వరకు పిల్లలు సోషల్ మీడియాకు దూరంగా ఉండటమే మంచిదని ఆయన అన్నారు. దీనికోసం రాష్ట్రంలో ఒక బలమైన చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ విషయంపై టీడీపీ జాతీయ ప్రతినిధి దీపక్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి లోకేష్ చెప్పింది నూటికి నూరు శాతం నిజమని మద్దతు తెలిపారు. సోషల్ మీడియా వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని, అక్కడ దొరికే చెడు సమాచారం నుంచి వాళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన చెప్పారు. గతంలో సోషల్ మీడియాను కొందరు మహిళలపై దాడులు చేయడానికి వాడుకున్నారని, అలాంటి పరిస్థితులు మళ్లీ రాకూడదంటే పిల్లలను ఆన్‌లైన్ నెగటివిటీ నుంచి రక్షించాలని ఆయన అన్నారు.

ఒకవేళ ఇదే జరిగితే, దేశంలోనే పిల్లల కోసం ఇలాంటి చట్టం తెచ్చిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది. కేవలం చట్టం చేయడమే కాకుండా, అది అమలులోకి వస్తే సోషల్ మీడియా కంపెనీలు కూడా తమ పద్ధతులు మార్చుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మన పిల్లల భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.