160 CRPC అంటే ఏంటి? KTRకు ఈ సెక్షన్ కింద నోటీసులు ఎందుకు ఇచ్చారు?

160 CRPC

160 CRPC : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ అధికారులు 160 CrPC (ప్రస్తుతం కొత్త చట్టం BNSS ప్రకారం) కింద నోటీసులు జారీ చేశారు. జాబ్లీహిల్స్ ACP ఆఫీసుకు రేపు ఉదయం11 గంటలకు హాజరు కావాలని అధికారులు తమ నోటీసుల్లో పేర్కొన్నారు.

అసలు ఈ సెక్షన్ ప్రకారం, ఏదైనా ఒక కేసులో వాస్తవాలు లేదా సమాచారం తెలిసిన వ్యక్తిని సాక్షిగా (Witness) విచారించే అధికారం పోలీసులకు ఉంటుంది. అంటే, నోటీసు అందుకున్న వ్యక్తిని నేరుగా నిందితుడిగా కాకుండా, ఆ కేసు దర్యాప్తులో భాగంగా వివరాలు సేకరించేందుకు పిలుస్తున్నారని అర్థం.

ఈ సెక్షన్ కింద నోటీసు వస్తే, సదరు వ్యక్తి నిర్ణీత సమయానికి అధికారుల ముందు హాజరై విచారణకు సహకరించాల్సి ఉంటుంది. ఒకవేళ హాజరు కాకపోతే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. “మొన్న నాకు, ఇప్పుడు కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారు.. మేము ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నందుకే ఈ నోటీసుల డ్రామా ఆడుతున్నారు” అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసే అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలకు భయపడే ప్రసక్తే లేదని, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటామని హెచ్చరించారు.