Budget 2026 Highlights: నిర్మలమ్మ సింప్లీ సూపర్ బడ్జెట్.. హైలెట్స్ ఇవే!

Budget 2026 Highlights:

Budget 2026 Highlights: కేంద్రఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో 9వ బడ్జెట్‌తో దేశం ముందుకు వచ్చారు. వికసిత్ భారత్ అనే పెద్ద లక్ష్యంతో పాటు, సామాన్యుడి జేబుకు చిల్లు పడకుండా, రైతన్నకు భరోసా ఇచ్చేలా ఈసారి కేటాయింపులు(Budget 2026 Highlights) ఉన్నాయి. కేవలం లెక్కలు మాత్రమే కాదు, ప్రజల కష్టాలను తీర్చే అక్షయపాత్రగా ఈ బడ్జెట్‌ను తీర్చిదిద్దారు.

1.కొత్త ఆదాయపు పన్ను చట్టం

ప్రస్తుతం మనం వాడుతున్న ఆదాయపు పన్ను చట్టం 1961 నాటిది. అంటే 65 ఏళ్ల పాత చట్టం. ఇందులో పదాలు, నియమాలు చాలా కష్టంగా ఉండేవి. ఇప్పుడు దీనిని మార్చబోతున్నారు. 2026 ఏప్రిల్ 1 నుంచి రాబోయే కొత్త చట్టం చాలా సులభంగా ఉంటుంది. మన ఆదాయం ఎంత? మనం ఎంత పన్ను కట్టాలి? అనేది ఎవరికి వారు చదువుకుని అర్థం చేసుకునేలా మార్చారు. ట్యాక్స్ రిటర్న్స్ (ITR) తప్పులు ఉంటే సరిచేసుకోవడానికి ఇచ్చే గడువును కూడా మార్చి 31 వరకు పెంచారు. ఇది ఇప్పటివరకు డిసెంబర్ 31 వరకు మాత్రమే ఉండేది.

2. హైస్పీడ్ రైళ్లు

దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించడానికి ప్రభుత్వం 7 కొత్త హైస్పీడ్ రైల్ కారిడార్లు ప్రకటించింది.

హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని మూడు రూట్లు (హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, పుణె-హైదరాబాద్) రాబోతున్నాయి. గంటల కొద్దీ సాగే ప్రయాణం నిమిషాల్లో ముగుస్తుంది. ఉదాహరణకు హైదరాబాద్ నుండి బెంగళూరుకు ఇప్పుడు 10 గంటలు పడితే, ఈ హైస్పీడ్ రైలులో కేవలం 3 గంటల్లోనే వెళ్ళిపోవచ్చు.

3. సెమీకండక్టర్ మిషన్ 2.0

సెల్‌ఫోన్లు, కార్లు, వాషింగ్ మెషీన్లలో వాడే చిన్న చిప్స్ కోసం మనం ఇప్పటిదాకా చైనా, తైవాన్ దేశాలపై ఆధారపడ్డాం. ఇప్పుడు ఇందుకోసం రూ.40 వేల కోట్లతో రెండో దశ పథకాన్ని మొదలుపెట్టారు. మన దేశంలోనే ఈ చిప్స్ తయారైతే, భవిష్యత్తులో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు చాలా వరకు తగ్గుతాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పని ఉండదు కాబట్టి వస్తువులు చౌకగా దొరుకుతాయి.

4. వ్యవసాయానికి పెద్ద పీట

రైతులు కేవలం ఒకే రకమైన పంటలు వేయకుండా, ఎక్కువ లాభం ఇచ్చే పంటల వైపు మళ్లేలా ప్రభుత్వం సాయం చేస్తోంది. సహారా పథకం కింద కొబ్బరి, జీడిపప్పు, కోకో సాగుకు మద్దతు ఇస్తారు. అలాగే గంధం చెట్లు, వాల్‌నట్స్ వంటి ఖరీదైన పంటల కోసం ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చారు. ఒకసారి పెట్టుబడి పెడితే ఏళ్ల తరబడి ఆదాయం వచ్చే పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నారు. దీనివల్ల రైతు ఆదాయం స్థిరంగా పెరుగుతుంది.

5. ప్రాణం కాపాడే బడ్జెట్!

వైద్యం కోసం పట్టణాలకు వెళ్లే అవసరం లేకుండా, అలాగే మందుల కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దేశవ్యాప్తంగా 5 ప్రాంతీయ మెడికల్ హబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 17 రకాల క్యాన్సర్ మందులపై పన్నులు పూర్తిగా ఎత్తివేశారు. క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులకు వాడే ఇంజక్షన్లు, టాబ్లెట్లు సామాన్యుడికి అందుబాటులోకి వస్తాయి.